అధికార యంత్రాంగం అంతా అక్క‌డే తిష్ఠ‌.. బాబు కోసం ఉరుకులు ప‌రుగులు!

అయితే.. ప్ర‌మాణ స్వీకారానికి మరొక్క రోజు మాత్ర‌మే స‌మ‌యం ఉంది.

Update: 2024-06-10 15:13 GMT

ఏపీలో అధికార యంత్రంగం అంతా కూడా.. గ‌న్న‌వ‌రంలో తిష్ఠ వేసింది. ఉన్న‌తాధికారుల నుంచి శాఖ సెక్ర‌టరీల వ‌ర‌కు అంద‌రూ కూడా.. పెద్ద ఎత్తున గ‌న్న‌వ‌రం స‌మీపంలోని కేస‌ర‌ప‌ల్లిలోనే కూర్చున్నారు. టీడీపీ అధినేత‌, కూట‌మి పార్టీల నేత చంద్ర‌బాబు ఈనెల 12న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో వేదిక ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. అయితే.. ప్ర‌మాణ స్వీకారానికి మరొక్క రోజు మాత్ర‌మే స‌మ‌యం ఉంది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీర‌బ్‌కుమార్ ప్ర‌సాద్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసు కున్నారు. వ‌చ్చే అతిథులు.. పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. మ‌రోవైపు చెదురుమొదురు వ‌ర్షాలు కురుస్తున్నాయి. మంగ‌ళ‌వారం, బుధ‌వారం నాటికి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. దీంతో మ‌రింత ప‌టిష్ఠంగా ఏర్పాట్లు చేసేందుకు అధికార యంత్రాంగాన్ని మొత్తాన్నీ కేస‌ర‌ప‌ల్లిలోనే మోహ‌రించారు.

సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులు ఏర్పాట్ల‌లో త‌ల‌మున‌క‌ల‌య్యారు. ఇక‌, సీనియ‌ర్ ఐపీఎస్ లు కూడా భ‌ద్ర‌త ప‌రంగా ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చ‌ర్య‌లు తీసుకున్నారు. వైసీపీలో ఓడిపోయిన నాయ‌కుల‌కు.. ఇప్ప‌టికే నోటీసులు జారీ చేసిన‌ట్టు పోలీసులు చెబుతున్నారు. ప్ర‌మాణ స్వీకార ఘ‌ట్టానికి ఎలాంటి ఇబ్బందులు త‌లపెట్టినా క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేస్తామ‌ని హెచ్చ‌రించిన‌ట్టు తెలిసింది. మ‌రోవైపు. వ‌ర్షాల‌తో ప‌నులు నెమ్మ‌దిస్తున్నాయి.

దీంతో ప‌నుల‌కు ఇబ్బంది లేకుండా మ‌రింత మంది కార్మికుల‌ను కూడా త‌ర‌లించారు. ఎట్టి ప‌రిస్థితిలో నూ వేదిక నిర్మాణ ప‌నులు 11వ తేదీ మంగ‌ళ‌వారం రాత్రికి పూర్తికావాల‌ని ఆదేశించారు. అదేవిధంగా ఇత‌ర నిర్మాణ ప‌నులు కూడా.. 11వ తేదీ మ‌ధ్యాహ్నానికి పూర్తికావాల‌ని గ‌డువు విధించారు. ఆ మేర‌కు సీనియ‌ర్ ఐపీఎస్‌, ఐఏఎస్ అధికారులు ద‌గ్గ‌రుండి మ‌రీ ఆయా ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. డీజీపీ గుప్తా కూడా.. వేదిక నిర్మాణ ప‌నుల‌పై ఓ క‌న్నేసి ఉంచారు. నిరంత‌రం డాగ్ స్క్వాడ్‌లు.. బాంబు త‌నిఖీ బృందాలు ప‌నిచేస్తున్నాయి.

Tags:    

Similar News