జూ(న్) లక టక.. అందరి కళ్లూ అటే

ఎన్నడూ లేని విధంగా సార్వత్రిక ఎన్నికలు ఈసారి ఏడు దశల్లో 44 రోజుల పాటు జరిగాయి.

Update: 2024-05-30 15:30 GMT

సహజంగా జూన్ నెల వస్తున్నదంటే అందరూ ఖర్చుల గురించి భయపడతారు. ఇంటి అద్దె పెరుగుతుందని.. బదిలీ అవుతుందని.. పిల్లల స్కూల్ ఫీజు కట్టాలని.. ఇలా అనేక రకాలుగా టెన్షన్ అవుతుంటారు.. కానీ, ఈసారి అందరూ మహా ఉత్సుకతతో ఉన్నారు. జూన్ ఎప్పుడు వస్తుందా? అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. దీనికి ఒకటికి రెండు కారణాలున్నాయి.

జూన్ 1నే మొదలు..

ఎన్నడూ లేని విధంగా సార్వత్రిక ఎన్నికలు ఈసారి ఏడు దశల్లో 44 రోజుల పాటు జరిగాయి. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో 1951-52లో మాత్రమే నాలుగు నెలల పాటు ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అత్యధికంగా 44 రోజుల పాటు ఎన్నికలు జరిగాయి. మార్చి 16న షెడ్యూల్ వెలువడగా ఏప్రిల్ 19న తొలి విడత, జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది. అయితే, జూన్ 1 సాయంత్రంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. తద్వారా దేశంలో, ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో గెలుపు ఎవరిదో ఓ అంచనా వస్తుంది. ఇక జూన్ 4న అసలైన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో టెన్షన్ తీరిపోనుంది.

ఐపీఎల్ అయిపోయింది.. ప్రపంచ కప్ మొదలైంది

మొన్నటివరకు అభిమానులు అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. రెండు నెలల 4 రోజుల పాటు సాగింది. అప్పుడే లీగ్ అయిపోయిందా? అని అభిమానులు నిర్వేదంలో ఉండగా.. ధనాధన్ అంటూ ప్రపంచ కప్ వచ్చేసింది. ఈసారి అమెరికా-కరీబియన్ దీవులు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇందులో భాగంగా టీమిండియా జూన్ 1న బంగ్లాదేశ్ తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. జూన్ 5న ఐర్లాండ్ తో, 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడుతుంది. అలా అభిమానులకు మళ్లీ వినోదం దక్కనుంది.

రుతు పవనాలు వచ్చేశాయి

ఈ సంవత్సరం దేశంలో ఎండల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఢిల్లీలో బుధవారం 52 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. అంతేగాక రాజస్థాన్ లో రోజూ 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఉంటోంది. ఇంతటి ఉక్కపోతకు చెక్ పెడుతూ గురువారం రుతుపవనాలు కేరళను తాకాయి. మరోవైపు జూన్ 5న ఏపీకి, 10న తెలంగాణకు రానున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. దీంతో ప్రజలను రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందికి గురిచేసిన ఎండలకు చెక్ పడనుంది.

తెలంగాణలో పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ మే 26న జరిగింది. దీని ఓట్ల లెక్కింపు జూన్ 5న మొదలుకానుంది. ప్రాధాన్య ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాన్ని జూన్ 6న ప్రకటించనున్నారు.

ఈ కారణాల రీత్యా ప్రజలంతా ప్రస్తుతం జూన్ నెల వైపు ఆసక్తిగా చూస్తున్నారు.

Tags:    

Similar News