అప్పుడు కలవలేనోళ్లంతా ఇప్పుడు కలిసేస్తున్నారట!
ముఖ్యమంత్రి పదవి పోయిన నాలుగైదు రోజులకే ఫాంహౌస్ లోని బాత్రూంలో కాలు జారి పడటం తుంటి ఎముక విరగటంతో ఆయన.. యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పరామర్శలన్నా.. పలకరింతలన్నా ఏ మాత్రం పడని గులాబీ బాస్ కేసీఆర్ కు కొత్త కష్టం వచ్చి పడింది. ఎవరెట్లా ఉన్నా.. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఏ రోజూ పది మందిని కలిసేందుకు వెళ్లటం చూసింది లేదు. అంతకుమించి.. ఎవరిని దగ్గరకు రానివ్వటం చూడలేదు. తనదైన ప్రపంచంలో తాను కోరుకున్న వారిని మాత్రమే దగ్గరకు వచ్చేలా సెటప్ చేసుకున్న ఆయన.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నరేళ్లు నడిపేశారు. అలాంటి ఆయన ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి పోయిన నాలుగైదు రోజులకే ఫాంహౌస్ లోని బాత్రూంలో కాలు జారి పడటం తుంటి ఎముక విరగటంతో ఆయన.. యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు పలుకరింపులు జరగలేదు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని యశోదా ఆసుపత్రికి వెళ్లి కలవటం.. పరామర్శలు పూర్తి చేశారో.. అప్పటి నుంచి వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా కేసీఆర్ ను కలిసి వస్తున్నారు. ఆయన్ను పలుకరింతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. చివరకు ఆయన్ను కలిసేందుకు గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో కేఏ పాల్ ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు కానీ యశోదా ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్నప్పుడు మాత్రం కలిసే వీలు చిక్కింది.
ప్రముఖులు.. సెలబ్రిటీల పరామర్శలు అంతకంతకూ పెరగటం.. చివరకు సామాన్య ప్రజలు సైతం జిల్లాల నుంచి ఆసుపత్రికి వచ్చి.. సారును కలుస్తామని.. పరామర్శిస్తామంటూ ఆందోళనలు చేస్తున్న వేళ.. చేతులు జోడించి మరీ.. పరామర్శలకు రావొద్దని వేడుకోవటం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో ఆసక్తికర వ్యాఖ్య పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. సీఎంగా సారును కలవాలనుకున్న వాళ్లలో చాలామంది కలవలేకపోయారని.. అలాంటిది సారుగా ఆసుపత్రి బెడ్ మీద ఉన్న వేళ మాత్రం కలిసే అవకాశం చిక్కిందంటున్నారు. మొత్తంగా సారును కలిసే అంశం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిందంటున్నారు.