రేవతి చనిపోయిన విషయం శుక్రవారం తెలియటమా బన్నీ?

పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో ను ప్రదర్శించే థియేటర్లలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ ఒకటి.

Update: 2024-12-07 04:55 GMT

పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో ను ప్రదర్శించే థియేటర్లలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ ఒకటి. అల్లు అర్జున్ తో పాటు.. మరికొందరు హీరోలకు సైతం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని థియేటర్ లలో తమ సినిమా రిలీజ్ వేళలో.. ప్రేక్షకులతోకలిసి చూడటం ఒక సెంటిమెంట్ గా చెప్పాలి. అందుకు అల్లుఅర్జున్ మినహాయింపు కాదు. ఇదే విషయాన్ని తన తాజా వీడియోలో అల్లు అర్జున్ కూడా చెప్పారు. ఇదేమీ తప్పు కాదు. ఆ ఆనవాయితీని ఫాలో అవుతూ తన తాజా పుష్ప2 ప్రీమియర్ షోకు వెళ్లినట్లుగా అల్లు అర్జున్ వెల్లడించారు.

వీటిలో ఏ ఒక్క మాటను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాకుంటే.. ఇదే వీడియోలో తన వీరాభిమాని (ఆ మాటను అల్లు అర్జున్ తన వీడియోలో చెప్పలేదు. కాకుంటే ఆ ఫ్యామిలీ బన్నీకి వీరాభిమానిగా మీడియాలో వార్తలు వచ్చాయి) రేవతి.. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన విషయం తెలిసిందన్న దాని మీద కూడా ఎలాంటి అభ్యంతరం లేదు.

కానీ.. షాకింగ్ గా అనిపించేదేమంటే.. తొక్కిసలాటలో గాయపడిన రేవతి మరణించిన విషయం తనకు తర్వాతి రోజు ఉదయానికి కానీ తెలీలేదని చెప్పటమే. ఎందుకుంటే.. తొక్కిసలాటలో గాయపడిన రేవతి.. మరణించిన విషయం రాత్రి 11 గంటల వేళకే మీడియాలో వచ్చేసింది. వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ అయ్యింది. అభిమానులతో పాటు సంధ్యలో సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ కు విషయం తెలీకపోవటం అన్నది జీర్ణించుకోలేనిదిగా అనిపిస్తుంది.

అంత పెద్ద హీరో.. అంత భారీ వ్యవస్థను నిర్వహించే బన్నీ బలగమంలో ఏ ఒక్కరు కూడా ఆయనకు జరిగిన దారుణ విషాద ఘటనకు సంబంధించిన సమాచారం ఇవ్వకపోవటం ఏమిటి? సరే.. ఎవరూ ఇవ్వలేదనుకుందాం. బన్నీకి వాట్సాప్ లో గ్రూపులు లేవా? లేవనే అనుకుందాం. వాట్సాప్ లో ఆయనకు సమాచారం ఇచ్చినోళ్లు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరా? అన్నది ప్రశ్న. సరే.. అది కూడా లేదనే అనుకుందాం. ఇవాల్టి రోజున సోషల్ మీడియా ఉంది. మీడియా సంస్థలకు చెందిన న్యూస్ యాప్ ఒకట్రెండు అయినా ప్రతి ఒక్కరి ఫోన్ లో ఉంటుంది.

ఇలాంటి షాకింగ్ ఘటనలు జరిగినప్పుడు పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు పంపుతుంటారు. ఆ లెక్కన చూసినా అల్లు అర్జున్ కు విషాద ఘటన జరిగిన రాత్రికే తెలిసి ఉండాలి కదా? అన్న సందేహం రాక మానదు. ఈ అంశమే అల్లు అర్జున్ మీడియాలో మాట్లాడిన అన్ని మాటల్లోనూ షాక్ కు గురి చేసేది. ఇప్పటికైనా ఏదైనా సంచలన ఘటన చోటు చేసుకుంటే.. ఆయన చుట్టూ ఉన్న వారిలో ఒక్కరంటే ఒక్కరైనా సమాచారం ఇచ్చే ఏర్పాటు చేసుుకోవటం అల్లు అర్జున్ కు తక్షణ అవసరం. కాదంటారా?

Tags:    

Similar News