'పుష్ప' ప్రచారం చేసినా ఫలితం మారలేదు

అందరి అంచనాలకు భిన్నంగా పోలింగ్ ముగిసేందుకు కాస్త ముందుగా ఎన్నికల ప్రచారంలోకి ఎంట్రీ ఇచ్చారు బన్నీ అలియాస్ అల్లు అర్జున్.

Update: 2024-06-04 07:32 GMT

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవటం తెలిసిందే. అందరి అంచనాలకు భిన్నంగా పోలింగ్ ముగిసేందుకు కాస్త ముందుగా ఎన్నికల ప్రచారంలోకి ఎంట్రీ ఇచ్చారు బన్నీ అలియాస్ అల్లు అర్జున్. మెగా అభిమానులు మొత్తం షాక్ తినేలా ఆయన నంద్యాలకు వెళ్లటం.. అక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తరఫున ప్రచారానికి దిగటం అందరిని అవాక్కు అయ్యేలా చేసింది.

తమ కుటుంబానికి చెందిన జనసేన అధినేత పవన్ తరఫు కనీస ప్రచారం చేయకపోవటం ఒక ఎత్తు అయితే.. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు పవన్ ను టార్గెట్ చేసే వైసీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థికి మద్దతుగా బయటకు రావటం సంచలనంగా మారింది. నంద్యాల వైసీపీ అభ్యర్థి తనకు స్నేహితుడని.. అతడు అడగనప్పటికీ తాను అతని తరఫున ప్రచారం చేయటానికి వచ్చినట్లుగా చెప్పారు.

వైసీపీ అభ్యర్థికి బన్నీ ప్రచారం చేయటంపై మెగా అభిమానులతో పాటు.. జనసైనికులు.. కూటమి వర్గాలు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం.. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ ఇలాంటి నిర్ణయాన్ని ఎలా తీసుకుంటారు? అన్నప్రశ్న పలువురి నోట వినిపించింది. ఇదిలా ఉంటే.. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి కంటే అధిక్యతతో టీడీపీ అభ్యర్థి మహ్మద్ ఫరూక్ నిలిచారు. మరోవైపు.. అంచనాలకు మించిన రీతిలో టీడీపీ కూటమి ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తున్న వేళ.. నంద్యాల ఫలితం టీడీపీ కూటమికి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. తన ఇమేజ్ తో ఫలితాల్ని మార్చేందుకు ప్రయత్నించిన అల్లు అర్జున్ సైతం ఫెయిల్ అయ్యారని చెప్పాలి. తన స్నేహితుడికి ఇంటికి వచ్చిన బన్నీని చూసేందుకు వచ్చిన అభిమానులంతా ఓటేసినా.. వైసీపీ అభ్యర్థి విజయం సాధించి ఉండేవారన్న వ్యాఖ్య కొందరి నోటి నుంచి రావటం గమనార్హం.

Tags:    

Similar News