కుళ్లిన మాంసం వడ్డన.. ప్రముఖ హోటల్‌ సీజ్‌!

వినియోగదారుల నుంచి భారీ ఎత్తున దండుకుంటున్న హోటళ్లు, రెస్టారెంట్లలో చాలా వరకు శుచి, శుభ్రతలను పాటించడం లేదని చాలాసార్లు రుజువైంది

Update: 2023-09-18 04:47 GMT

వినియోగదారుల నుంచి భారీ ఎత్తున దండుకుంటున్న హోటళ్లు, రెస్టారెంట్లలో చాలా వరకు శుచి, శుభ్రతలను పాటించడం లేదని చాలాసార్లు రుజువైంది. ఆహార భద్రత అధికారుల తనిఖీల్లో ఇలా చాలా హోటళ్లు దొరికిపోయాయి. తాము అందించే ఆహార పదార్థాలకు భారీగా వసూలు చేస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు అపరిశుభ్ర వాతావరణంలో కిచెన్లు నిర్వహించడం వంటివి చేస్తున్నాయని గతంలోనే అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. అధికారుల జరిమానాలు విధిస్తున్నా కొన్ని హోటళ్లు యథావిధిగా అపరిశుభ్ర వాతావరణంలోనే కిచెన్లను నిర్వహిస్తున్నాయి. అలాగే నిల్వ ఉన్న, పాడైపోయిన ఆహార పదార్థాలను వడ్డిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే జంట నగరాల్లో ఒకటైన సికింద్రాబాద్‌ లో పేరున్న ప్రముఖ హోటల్‌ ఆల్పా హోటల్‌ కు షాక్‌ తగిలింది. ఈ హోటల్‌ కు నిత్యం ఎంతో మంది వస్తుంటారు. అయితే కిచెన్‌ ను అపరిశుభ్ర వాతావరణంలో నిర్వహించడంతో ఈ హోటల్‌ ను అధికారులు సీజ్‌ చేయడం హాట్‌ టాపిక్‌ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. మహ్మద్‌ అనే యువకుడు తన తోటి స్నేహితులతో కలిసి ఆల్పా హోటల్‌ కు వెళ్లాడు. అక్కడ మటన్‌ కీమా రోటీ తిన్న మహ్మద్‌ కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు, విరోచనాలతో ఆల్ఫా హోటల్లోనే విలవిల్లాడిపోయాడు.

పాడైన కీమా రోటీ వల్లే ఇలా జరిగిందని వినియోగదారులు అనుమానం వ్యక్తం చేశారు. రోటీ నుంచి దుర్వాసన వస్తుందని వెల్లడించారు.

ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఆల్ఫా హోటల్‌ చేరుకున్నారు. హోటల్‌ లో ఆహారం తయారుచేసే వంట గదిని పరిశీలించిన అధికారులు విస్తుపోయారు. కిచెన్‌ అపరిశుభ్ర వాతావరణంలో ఉందని నిర్ధారించారు. అలాగే పాడైన ఆహార పదార్థాలను వడ్డిస్తున్నారని తేల్చారు. ఇక్కడ ఆహారపదార్థాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని నిర్ధారించారు. నిల్వ ఉన్న పదార్థాలను విక్రయించడంతో అవి అనారోగ్య సమస్యకు దారితీస్తున్నాయని తేల్చారు. ఈ నేపథ్యంలో ఆల్ఫా హోటల్‌ యజమాని జమాలుద్ధీన్‌ పై కేసు నమోదు చేశారు.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఉన్న ఆల్ఫా హోటల్‌ ను నిత్యం కొన్ని వేల మంది సందర్శిస్తుంటారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోనే ఉండటంతో నిత్యం రద్ధీతో ఉంటోంది. పాడైన ఆహార పదార్థాలను తిని వినియోగదారుల అనారోగ్యానికి గురవుతున్నారనే ఫిర్యాదులు రావడంతో, తనిఖీ చేసిన ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఆ హోటల్‌ ను సీజ్‌ చేశారు.

ఆ హోటల్లో ఆహార పదార్ధాల నాణ్యత, పరిశుభ్రత సరిగా లేదంటూ గత కొంత కాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు సెప్టెంబర్‌ 15న తనిఖీలు చేశారు. ఆహార పదార్ధాల శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌ కు పంపారు. పరిశుభ్రత పాటించాలని హోటల్‌ యాజమాన్యాన్ని హెచ్చరించారు. కానీ వారి హెచ్చరికలను హోటల్‌ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో సెప్టెంబర్‌ 17న మళ్ళీ మరోమారు హోటల్లో తనిఖీలు నిర్వహించి.. దానికి తాళం వేశారు.

Tags:    

Similar News