బడ్జెట్ లో అమరావతి రైల్వే లైన్ కు రూ.వెయ్యి!
మరో యాభై రోజుల్లో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. ప్రభుత్వం ఏదైనా కాస్తంత ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తుంది
సంక్రాంతి పండక్కి భారీ అంచనాలతో విడుదలైన మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాకు సంబంధించి మల్టీఫ్లెక్సులో వసూలు చేసిన ధర రూ.400 వరకు ఉంటుంది. అదే ఆన్ లైన్ లో టికెట్ కొంటే అంతకు మించే ఉంటుంది. అలాంటి మూడు టికెట్లు కొంటే అయ్యే ఖర్చు కంటే తక్కువగా ఒక ప్రతిష్ఠాత్మక రైల్వే ప్రాజెక్టుకు నిధులు కేటాయించటాన్ని ఏమనాలి? ఎలా చూడాలి? ఇదంతా చూస్తే.. మోడీ సర్కారా మజాకానా? అనుకోకుండా ఉండలేం.
మరో యాభై రోజుల్లో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. ప్రభుత్వం ఏదైనా కాస్తంత ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తుంది. మిగిలిన ప్రాజెక్టుల సంగతి ఎలా ఉన్నా.. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే పనుల విషయంలో అప్రమత్తంగా ఉంటూ.. ప్రజల్లో వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది. కానీ.. అలాంటిదేమీ లేకుండా ఎవరేం అనుకున్నా తమకు ఫర్లేదని.. తమకు తోచిందే చేస్తామన్న రీతిలో వ్యవహరించే ప్రభుత్వంగా కేంద్రంలోని మోడీ సర్కారును చెప్పాలి. తాజా బడ్జెట్ లో ఏపీ రాజధాని అమరావతి రైల్వే లైన్ కోసం కేటాయించిన సొమ్ములు ఎన్నో తెలుసా? అక్షరాల రూ.వెయ్యి మాత్రమే.
చంద్రబాబు ప్రభుత్వంలో విజయవాడ నుంచి రాజధాని అమరావతికి లింకు చేసేందుకు వీలుగా రైల్వే లైన్ ప్రాజెక్టును సిద్ధం చేశారు. దీనికి అయ్యే ఖర్చు రూ.2679 కోట్లుగా అప్పట్లో అంచనా వేశారు. దీని కోసం గడిచిన ఐదేళ్లలో కేంద్రం చేసిన ఖర్చు అక్షరాల రూ.2.20 కోట్లు మాత్రమే. అది కూడా సర్వేల కోసం ఖర్చు చేయగా.. తాజా బడ్జెట్ లో కేటాయించిన రూ.వెయ్యి చూస్తే కేంద్రం ఏపీకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి.
అంతేకాదు.. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నదక్షిణ కోస్తా జోన్ కార్యాలయాలకు కలిపి రూ170 కోట్లు అంచనా వేస్తే.. తాజా బడ్జెట్ లో కేటాయించింది రూ.9కోట్లు మాత్రమే. మొత్తంగా కొన్ని ప్రాజెక్టులకు మొక్కుబడిగా ఇస్తే.. ఎక్కువ ప్రాజెక్టులకు మొండిచెయి చూపించారని చెప్పాలి. ఆదాయపరంగా ఏపీ వ్యాప్తంగా వచ్చే దానితో పోలిస్తే.. నిధుల కేటాయింపులో ఇచ్చిన ప్రాధాన్యత తక్కువని చెప్పాలి.