అమరావతి నిర్మాణానికి డబ్ల్యూబీ, ఏడీబీ నుంచి గుడ్ న్యూస్!

అవును... ఇటీవల బడ్జెట్ లో కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన మేరకు అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Update: 2024-08-18 05:10 GMT

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా రెండు లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించిన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా ఏపీలో ‘ఏ’ అంటే అమరావతి, ‘పీ’ అంటే పోలవరం అని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్ల రుణం ఇప్పించేందుకు సహకరిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో గుడ్ న్యూస్ వచ్చేసింది!

అవును... ఇటీవల బడ్జెట్ లో కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన మేరకు అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ)తో కలిసి ఈ మొత్తాని మంజూరు చేయనుందన్ని సమాచారం. ఇదే క్రమంలో... భవిష్యత్తులో మరింత ఆర్థికసాయం అందించే దిశగానూ చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో... ప్రపంచ బ్యాంక్, ఏడీబీలకు చెందిన చెరో పదిమందితో కూడిన ప్రతినిధుల బృందం ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకూ అమరావతిలో పర్యటించనుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీయే అధికారులతోనూ చర్చించనుంది. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకూ ఇప్పటికే ప్రపంచ బ్యాంకుకు చెందిన నలుగురు ప్రతినిధుల బృందం అమరావతిలో పర్యటించింది. ఇదే సమయంలో సీఎం చంద్రబాబుతోనూ సమావేశమైంది.

కేంద్రం సూచన మేరకే ఏడీబీతో కలిసి ప్రపంచబ్యాంకు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని అంటున్నారు. వాస్తవానికి 2019కి ముందే రుణం మంజూరుకు అవసరమైన కసరత్తులు చాలా వరకూ పూర్తైన పరిస్థితి. దీంతో.. ఇప్పుడు మిగిలిన ప్రక్రియలను వేగంగా ముగించి, వీలైనంత త్వరగా మంజూరు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

కాగా... 2019కి ముందే రాజధాని నిర్మాణానికి ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ (ఏఈఈఇబీ) తో కలిసి తొలి విడతలో రూ.3,500 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అందుకు అవసరమైన ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రభుత్వం మారింది. ఈ నేపథ్యంలో.. అమరావతికి రుణం అవసరం లేదని అప్పటి సీఎం జగన్ కేంద్ర ఆర్థిక శాఖకు చెప్పడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయిందని అంటారు.

Tags:    

Similar News