అమెజాన్ కు రూ.102 కోట్లకు చిల్లు పెట్టిన హైదరాబాదీ మోసగాళ్లు

ఈ భారీ కుట్రకు ఐటీ కారిడార్ లోని గచ్చిబౌలి వేదిక కావటం విశేషం. అదెలానంటే..

Update: 2025-01-28 12:30 GMT

సంచలన విషయం వెలుగు చూసింది. దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ను హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఆ సంస్థకు చెందిన ఉద్యోగులు.. గతంలో పని చేసి మానేసిన ఉద్యోగులు కలిసి ఒక పథకం ప్రకారం దోచేసిన వైనం వెలుగు చూసింది. దాదాపు రూ.102 కోట్ల మేర సంస్థకు నష్టం వాటిల్లేలా చేశారని తేల్చారు. అమెరికాలో సరకులు సరఫరా చేసే వారితో కలిసి పన్నిన కుట్రతో ఈ భారీ నష్టం వాటిల్లినట్లుగా సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అమెజాన్ కంప్లైంట్ చేసింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఈ భారీ కుట్రకు ఐటీ కారిడార్ లోని గచ్చిబౌలి వేదిక కావటం విశేషం. అదెలానంటే.. ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు డెలివరీ చేసే వస్తువుల మానిటరింగ్ గచ్చిబౌలి నుంచే జరుగుతుంది. అమెజాన్ యాప్ ద్వారా వినియోగదారుడు తమకు కావాల్సిన వస్తువుల్ని ఆర్డర్ చేసే వైనం తెలిసిందే. ఆ వెంటనే.. దాన్ని సమీప గోదాము నుంచి.. అక్కడి నుంచి వినియోగదారుడు ఉండే గోదాముకు బదిలీ చేస్తారు. అక్కడి నుంచి వినియోగదారుడి అడ్రస్ కు డెలివరీ చేస్తారు.

ఇదంతా టెక్నాలజీ సాయంతో తేలిగ్గా చేసేస్తుంటారు. డెలివరీ సిబ్బంది కోసం ఫోన్లో ప్రత్యేక యాప్ ఉంది. గోదాము నుంచి సరకు తీసుకున్న తర్వాత చెకిన్ చేయటం.. ఆర్డర్ పెట్టిన కస్టమర్ కు వస్తువును డెలివరీ చేసిన తర్వాత చెక్ అవుట్ చేస్తారు. దీన్ని జీపీఎస్ ద్వారా పర్యవేక్షిస్తుంటారు. హైదరాబాద్ లోని గచ్చి బౌలిలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ డెలివరీ కార్యకలాపాల్ని పర్యవేక్షిస్తుంటారు. దీన్ని రిలే ఆపరేషన్ సెంటర్ గా పిలుస్తారు.

డెలివరీ చేసే ప్రతి వ్యక్తికి.. ఆ రూట్ లో ఉన్న మరో ఐదు నుంచి ఆరుగురు వినియోగదారులకు సంబంధించిన వస్తువుల్ని ఇస్తుంటారు. అంటే.. వారంతా ఆ రూట్ లోని వారికి డెలివరీ చేయాల్సి ఉంటుంది. వస్తువుల్ని డెలివరీ చేయని పక్షంలో ఆ విషయాన్ని యాప్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విషయాల్నిరిలే సెంటర్ లో ఉన్న వారు నిర్ధారిస్తుంటారు.వస్తువు డెలివరీ కోసం ఎంత దూరం వెళ్లారో లెక్కించి. అందుకు తగ్గట్లు ఖర్చులు చెల్లిస్తుంది అమెజాన్.

ఈ అంశాన్ని అసరాగా చేసుకున్ననిందితుడు మోసానికి తెర తీశారు. హైదరాబాద్ లోని రిలే ఆపరేషన్ సెంటర్ లో పని చేసే కొంతమంది ఉద్యోగులకు.. ఇక్కడ గతంలో పని చేసి మానేసిన పద్దెనిమిది మందిని ప్రలోభానికి గురి చేశారు. అమెరికాలో సరకుల డెలివరీకి వెళ్లకుండా వెళ్లినట్లుగా నకిలీ ట్రిప్పుల్ని నమోదు చేయించారు. డెలివరీకి వెళ్లగా వినియోగదారులు అందుబాటులో లేరని పేర్కొంటూ రవాణా ఛార్జీల కింద రూ.102,88,05,418 కోట్లను కొల్లగొట్టినట్లుగా ఆడిట్ టీం గుర్తించింది. ఈ భారీ కుంభకోణంలో పలువురు పాత్ర ఉండటం..వారిలో మహిళా ఉద్యోగులు ఉండటం సంచలనంగా మారింది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని అంశాలు వెలుగు చూడొచ్చన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News