అమెజాన్ లో అయోధ్య ప్రసాదం... సీసీపీఏ రియాక్షన్ ఇదే!
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం కోసం ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం కోసం ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇదే అదనుగా కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా అయోధ్య రామమందిర ప్రసాదం ఆన్ లైన్ లో విక్రయిస్తామంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఈ సమయంలో అమెజాన్ లో ఈ ఆప్షన్ తెరపైకి వచ్చిందని తెలుస్తుంది! దీంతో ఈ వ్యవహారంపై అమెజాన్ కు నోటీసులు వెళ్లాయి!
అవును... అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేళ "ఆధ్యాత్మికం" పేరిట ఆన్ లైన్ లో నకిలీ ఉత్పత్తుల హవా దర్శనమిస్తుంది. ఇందులో భాగంగా... శ్రీ రామ మందిర్ అయోధ్య ప్రసాద్, రఘుపతి నెయ్యి లడ్డూ, అయోధ్య ప్రసాద్, ఖోయా ఖోబీ లడ్డూ అంటూ రకరకాల పేర్లతో అమెజాన్ లో అమ్ముతున్నట్లు తెలుస్తోంది.
ఈ సమయంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఆరోపణల మేరకు ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ సంస్థకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో... సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) అమెజాన్ సంస్థకు నోటీసులు పంపింది. ఇదే సమయంలో... సాధారణ మిఠాయిలనే అయోధ్య రామ మందిర ప్రసాదంగా ఆన్ లైన్ లో అమ్ముతున్నారని, తప్పుడు ప్రకటనలతో వినియోగదారుల్ని మోసం చేస్తున్నారని అమెజాన్ పై ఫిర్యాదులో సీఏఐటీ పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఆ నోటీసులకు అమెజాన్ సంస్థ వారంలోపు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తుంది. ఈ నోటీసులకు సరైన వివరణ ఇవ్వని పక్షంలో... వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం చర్యలు తప్పవని సీసీపీఏ హెచ్చరించింది. మరోవైపు ఈ నోటీసులపై అమెజాన్ సంస్థ స్పందించింది. ఇందులో భాగంగా ఈ విషయంపై దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడిండింది.
కాగా... ఆన్ లైన్ లో అయోధ్య రాముని ప్రసాదం విషయంపై ఇప్పటికే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అయోధ్యను దర్శించుకునే భక్తులకు ప్రసాదాన్ని ఆలయ ప్రాంగణంలో మాత్రమే ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో... దీనికోసం ఎలాంటి ఆన్ లైన్ సేవలను ప్రారంభించలేదని వెల్లడించింది. అదేవిధంగా... దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.