అంబటి.. సొంతింట్లో ఏం జరుగుతుందో గమనిస్తున్నారా?

ఊరు మొత్తం సమర్థించే వ్యక్తి.. సొంతింటి విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. మన ఇల్లే కదా.. సెట్ చేయటం పెద్ద కష్టం కాదన్న ఆత్మవిశ్వాసం ఉంటుంది

Update: 2023-10-28 12:30 GMT

ఊరు మొత్తం సమర్థించే వ్యక్తి.. సొంతింటి విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. మన ఇల్లే కదా.. సెట్ చేయటం పెద్ద కష్టం కాదన్న ఆత్మవిశ్వాసం ఉంటుంది. అదే కొన్నిసార్లు ఉపద్రవంగా మారటమే కాదు.. మొదటికే మోసం వచ్చే పరిస్థితి నెలకొంటుంది. ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లిలో సొంత పార్టీలో అసమ్మతి గళం అంతకంతకూ పెరుగుతోంది. అంబటిని విభేదించే వారి సంఖ్య పెరగటమే కాదు.. వారంతా గ్రూపుగా మారటమేకాదు..ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి.. ఆయనపై ఓపెన్ గా విమర్శలు చేసే వరకు విషయం వెళ్లటం మంత్రిగారికి డేంజర్ బెల్స్ మోగినట్లేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా మారినప్పటికీ.. సత్తెనపల్లిని అంబటి సొంతిల్లుగా సొంత పార్టీ నేతలు గుర్తించకపోవటాన్ని ప్రశ్నిస్తున్నారు. తరచూ పెద్ద పెద్ద విషయాల మీద గుక్క తిప్పుకోకుండా మాట్లాడే అంబటి.. సొంత బలగాన్నిసెట్ చేసుకునే విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. తాజాగా సత్తెనపల్లి వైసీపీలో అసమ్మతి మరోసారి బయటకు రావటం చర్చనీయాంశంగా మారింది.

అంబటికి వ్యతిరేకంగా అధికార పార్టీ నేతలు గళం విప్పారు. నకరికల్లు మండలం గుండ్లపల్లిలో గురువారం రాత్రి కొందరు వైసీపీనేతలు.. కార్యకర్తలు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించటం ఒక ఎత్తు అయితే.. మంత్రి అంబటి నిర్వహిస్తున్న గడప గడపకు ప్రోగ్రాంకు పోటీగా జయహో జగనన్న పేరుతో కొత్త కార్యక్రమాన్ని చేపట్టటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు.. గ్రామంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద సభను ఏర్పాటు చేసి.. మంత్రిగా వ్యవహరిస్తున్న తమ ఎమ్మెల్యే అంబటిపై ఓపెన్ గానే విమర్శలు సంధించటం షాకింగ్ గా మారిందంటున్నారు.

పార్టీ కోసం కష్టపడుతున్న తమను మంత్రి పట్టించుకోవటం లేదని.. సొంత ఎజెండాతో పార్టీని నిర్వీర్యం చేస్తున్నట్లుగా దుయ్యబట్టారు. మండలంలో అతి పెద్ద గ్రామపంచాయితీగా ఉన్న గుండ్లపల్లిని మంత్రి విస్మరించటాన్ని తప్పు పట్టారు. రూ.40లక్షలు ఖర్చు చేసి మరీ ఎంపీపీగా అనురాధను గెలిపిస్తే.. పార్టీ నాయకత్వం గుర్తించకపోవటంలో మంత్రి అంబటి తప్పు ఉందన్నారు. అంతేకాదు.. గుండ్లపల్లిలో అక్రమంగా ఇసుకను తవ్వుతున్నా పట్టించుకోవటాన్ని వారు ప్రశ్నించారు. మొత్తంగా మంత్రి అంబటికి వ్యతిరేకంగా ఓపెన్ గా ఏర్పాటు చేసిన సభ.. నియోజకవర్గంలో కొత్త చర్చకు తెర తీసింది. ఇలాంటి వేళ.. పెద్ద పెద్ద విషయాల మీద మాట్లాడే అంబటి.. అందుకు భిన్నంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం మీద మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు. మరి.. ఈ విషయాన్ని అంబటి గుర్తిస్తారంటారా?

Tags:    

Similar News