ముద్రగడ నష్టపోయారు అంటూ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఇదిలా ఉండగా ముద్రగడ రాజకీయాల్లోకి వచ్చి తన సామాజిక వర్గం కోసం చేసిన అనేక పోరాటాల వల్ల పూర్తిగా నష్టపోయారు అని అంబటి అన్న వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.

Update: 2024-07-17 18:27 GMT

ఏపీ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభ రెడ్డి ఎంట్రీ కొత్తగానే ఉన్నా పాతదే. ముద్రగడ పద్మనాభం కాస్తా ముద్రగడ పద్మనాభరెడ్డి అయ్యారు. పవన్ పిఠాపురంలో ఎలా గెలుస్తారో చూస్తాను అని సవాల్ చేసిన పద్మనాభం పవన్ ని ఓడించకపోతే తన పేరుని పద్మనాభరెడ్డి గా మార్చుకుంటాను అని కూడా భీషణ ప్రతిజ్ఞ చేశారు.

దాంతో ఎన్నికల్లో వైసీపీకి పూర్తి వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. పవన్ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు. దాంతో మాట ప్రకారం పద్మనాభరెడ్డిగా తన పేరుని మార్చుకుని ముద్రగడ సంచలనం సృష్టించారు. అలా పద్మనాభరెడ్డి అయిన ఆయనను అభినందించేందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు

అధికారికంగా ముద్రగడ తమ పేరుని మార్చుకున్న తరువాత కలుద్దామని అనేక సార్లు అనుకుంటే అది ఇన్నాళ్ళకు కుదిరిందని అని అంబటి మీడియాకు చెప్పారు. రాజకీయాల్లో సవాల్ చేసి పారిపోయేవారే కానీ మాట మీద నిలబడిన వారిని తాను ఎక్కడా చూడలేదని అంబటి అన్నారు కాపులను వాడుకుని ముద్రగడ ఎన్నడూ రాజకీయాలు చేయలేదని అంబటి చెప్పారు.

ముద్రగడ కులోన్మాది కాదని తాను పుట్టిన కులంలో పేదలకు న్యాయం చేయడం కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారని అంబటి అన్నారు. కాపునాడు తొలి సభలలో పాల్గొనేందుకు ముద్రగడ తన అధికార పదవులను వదులుకున్నారు అని గుర్తు చేసుకున్నారు. ముద్రగడ లాంటి వారు ఎవరూ ఉండబోరని అన్నారు.

చంద్రబాబు కాపులను బీసీలలో చేరుస్తామని ఇచ్చిన హామీని అమలు చేయమని ముద్రగడ చేపట్టిన కాపుల ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసిందనంటే దాని వెనక ముద్రగడ నిజాయాతీ నిబద్ధత ఉందని అన్నారు. ముద్రగడతో తన పరిచయం రాజకీయాల కంటే ముందు అని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఇదిలా ఉండగా ముద్రగడ రాజకీయాల్లోకి వచ్చి తన సామాజిక వర్గం కోసం చేసిన అనేక పోరాటాల వల్ల పూర్తిగా నష్టపోయారు అని అంబటి అన్న వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ముద్రగడ ఎన్నికలకు ముందు జనసేనలో చేరాల్సి ఉంది. అయితే ఆయన ఎందుకో చేరలేదు. నాడే చేరి ఉంటే ఆయనకు పదవులు దక్కేవి అన్న భావన ఉండేది.

ఇక ముద్రగడ 2009లో చివరిసారిగా పోటీ చేశారు. ఆయన 2019లో వైసీపీలో చేరుతారు అని అనుకున్నారు. అయితే ఆనాడు కూడా ఆయన దూరంగా ఉండిపోయారు. దాంతో అపుడూ ఆయన అధికార పదవులకు దూరం అయ్యారని చెబుతారు. మొత్తానికి అంబటి రాంబాబు అన్నారని కాదు కానీ ముద్రగడ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో అయినా ఉండాల్సిన నేత. అలాగే కీలక పదవులు వరించదగిన నాయకుడు. కానీ ఆయన ఎందుకో రాజకీయంగా పట్టు విడిపులను ఆ క్రీడను అలవరచుకోలేదు అని అంటారు.

Tags:    

Similar News