అంబటి ఆవేదన అంతాఇంతా కాదు.. ఏం జరగనుంది?

గడిచిన ఐదేళ్లలో ఎప్పుడూ లేని కొత్త తీరును ప్రదర్శించారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు.

Update: 2024-05-15 04:00 GMT

గడిచిన ఐదేళ్లలో ఎప్పుడూ లేని కొత్త తీరును ప్రదర్శించారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. ఆత్మవిశ్వాసానికి కేరాఫ్ అడ్రస్ గా.. విషయం ఏదైనా సరే.. తనదైన భాష్యం చెప్పే ఆయన.. ఏపీలో జరిగిన ఎన్నికల పోలింగ్ పై మాత్రం ఆయన టోన్ మారింది. పోలింగ్ వేళ జరిగిన పరిణామాల గురించి వాపోతున్న ఆయన ఆవేదన ఇప్పుడు కొత్త చర్చగా మారింది. పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్న ఆయన.. రీపోలింగ్ కోసం డిమాండ్ చేయటం ఆసక్తికరంగా మారింది.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తమ పార్టీ శ్రేణులపై దాడులు జరిగినట్లుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపించిందన్న అంబటి.. తమ వాళ్లు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందించలేదని పేర్కొనటం గమనార్హం. తమ పార్టీకి చెందిన వారిపై దాడులు జరిగాయని.. గాయపడిన వారు ఫోన్లు చేసినా పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని పేర్కొన్నారు.

నార్నెపాడులో తన అల్లుడు ఉపేష్ మీద దాడి జరుగుతున్నా.. పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారే తప్పించి.. గొడవను ఆపలేదన్నారు. వైసీపీ శ్రేణుల మీద దాడులు జరుగుతున్నా సరైన రీతిలో స్పందించలేదన్న ఆయన.. ‘‘ఎన్నిసార్లు పోలీసులకు ఫోన్లు చేసినా వారు పట్టించుకోలేదు. ఇది పోలీసుల ఫెయిల్యూర్. అందుకే దమ్మాలపాడు.. నార్నెపాడు.. చీమలమర్రిలో రీపోలింగ్ నిర్వహించాలి’’ అంటూ అంబటి చేస్తున్న డిమాండ్ చూస్తుంటే.. పోలింగ్ తేడా జరిగిందా? ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు రూపంగా కనిపించే అంబటి ఇంతలా మాట్లాడటం దేనికి సంకేతం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మొత్తంగా మారిన అంబటి టోన్.. ఎన్నికల ఫలితానికి ముందు సీన్ అర్థమయ్యేలా చేసిందా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News