ఐదేళ్లలో పోలవరానికి ఏం చేశావ్ అంబటి?

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం నేపథ్యంలో ఏపీ మాజీ సీఎం జగన్ పై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించిన సంగతి తెెలిసిందే

Update: 2024-06-18 14:49 GMT

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం నేపథ్యంలో ఏపీ మాజీ సీఎం జగన్ పై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించిన సంగతి తెెలిసిందే. జగన్ వంటి వ్యక్తి ఏపీకి సీఎంగా ఉండడం వల్లే పోలవరానికి ఈ గతి పట్టిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ నిర్వాకం వల్లే పోలవరం నాశనమైందని చంద్రబాబు ఆరోపించారు. ప్రతి సోమవారం పోలవరం అంటూ నిన్న పోలరవం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలపై నీటిపారుదల శాఖ మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.

ఈ క్రమంలోనే పోలవరం ఆలస్యానికి కారణం చంద్రబాబేనని విమర్శించిన అంబటిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఐదేళ్లుగా పోలవరంపై అంబటి ఏం చేశారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పోలవరం అస్తవ్యస్తంగా ఉందని, పాత నిర్మాణాలలో వేటిని రిపేరు చేయాలి, కొత్తగా వేటిని నిర్మించాలి, ఇంకా ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు ఎంత సమయం పడుతుంది అన్న అంశాలపై పరిశీలన చేసిన తర్వాతే ఒక అంచనాకు రాగలమని చంద్రబాబు అన్నారు.

Read more!

ఇవన్నీ బేరీజు వేసుకుంటే పోలవరం పూర్తయ్యేందుకు సుమారు నాలుగేళ్లు పట్టవచ్చు అని చంద్రబాబు అన్నారు. కానీ, అంబటి మాత్రం తాను చెప్పిందే చంద్రబాబు చెప్పారని, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని చంద్రబాబు అన్నారని అంబటి వక్రభాష్యం చెప్పారు. వాస్తవానికి గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పోలవరం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిలో తయారయ్యాయి. వైసీపీ నేతల తప్పుల వల్ల పోలవరం ఇలా తయారైంది. జగన్ హయాంలో నీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్, అంబటిలు ప్రతిపక్ష నేతలపై నోరుపారేసుకోవడానికి వెచ్చించిన సమయంలో సగం సమయం కూడా పోలవరంపై వెచ్చించలేదన్న విమర్శలున్నాయి.

తమ పాలనలో పోలవరం నిర్మాణం పడకేసిందని సిగ్గుపడకుండా మళ్లీ చంద్రబాబుపై విమర్శలు చేయడం ఏమిటని అంబటిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు పోలవరం నిర్మాణం కోసం అహర్నిశలు కష్టపడ్డారని, చంద్రబాబు అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత పోలవరం పనులు ఎక్కడ ఆగాయో అక్కడి నుంచి వైసీపీ నేతలు కంటిన్యూ చేసినా ఈ పాటికి పోలవరం పూర్తయి ఉండేదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. పోలవరానికి నిధులు తేవడంలో జగన్ విఫలమయ్యారని, వచ్చిన నిధులతో సకాలంలో పనులు పూర్తి చేయడంలో ఆ పార్టీ మంత్రులు విఫలమయ్యారని అంటున్నారు. అటువంటి వారు చంద్రబాబుపై విమర్శలు చేయడంలో అర్థం లేదని చెబుతున్నారు.

Tags:    

Similar News