తన సినిమా డైలాగుతోనే పవన్ పై అంబటి సెటైర్!

పవన్ కల్యాణ్ చేసే వ్యాఖ్యలపైనా, తీసుకుంటున్న నిర్ణయాలపైనా జనసైనికులను అలర్ట్ చేస్తున్నట్లు చెబుతూ అంబటి రాంబాబు నెట్టింట స్పందిస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-03-12 08:57 GMT

ఏపీ రాజకీయాల్లో కొంతమంది నేతల మధ్య జరిగే విమర్శలు, ప్రతి విమర్శలు చాలా ఆసక్తిగా ఉంటాయి. అలాంటి వారిలో పవన్ కల్యాణ్ - అంబటి రాంబాబు ద్వయం కూడా ఒకటి. పవన్ కల్యాణ్ ని ఇటీవల కాలంలో అంబటి రెగ్యులర్ గా వెంటాడుతున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ చేసే వ్యాఖ్యలపైనా, తీసుకుంటున్న నిర్ణయాలపైనా జనసైనికులను అలర్ట్ చేస్తున్నట్లు చెబుతూ అంబటి రాంబాబు నెట్టింట స్పందిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రధానంగా "బ్రో" సినిమాలో తన పాత్రను పెట్టారంటూ ఫైర్ అయినప్పటినుంచీ అంబంటి రాంబాబు... పవన్ కల్యాణ్ ని వెంటాడుతున్నారు. ఈ సమయంలో తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలు మాత్రమే దక్కడంపై ఆ పార్టీ శ్రేణుల్లోనూ, కాపు సామాజికవర్గంలోనూ తీవ్ర చర్చ జరుగుతుందని అంటున్న సంగతి తెలిసిందే.

అయితే గాయత్రీ మంత్రంలో అక్షరాలు కూడా 24 ఉంటాయని పవన్ కల్యాణ్ తనదైన స్థాయిలో రియాక్ట్ అయ్యారు. అయితే... తాజాగా టీడీపీ - జనసేన కూటమిలో బీజేపీ కూడా వచ్చి చేరడంతో... పవన్ కల్యాణ్ మరోసారి త్యాగం చేయడం తప్పలేదని తెలుస్తుంది. దీంతో... జనసేనకు ప్రస్తుతానికి 21 అసెంబ్లీ 2 లోక్ సభ స్థానాలు దక్కాయి. అయితే... ఇదే ఫైనల్ కాకపోవచ్చనే చర్చ కూడా జరుగుతుండటం గమనార్హం.

దీంతో... "తెలుగుదేశం వేసే ముష్టి 20 సీట్లను తీసుకుని.. జనసైనికుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతానా..? గౌరవప్రదమైన సీట్లు ఇస్తేనే టీడీపీతో పొత్తు ఉంటుంది" అంటూ గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలను మరోసారి తెరపైకి తెస్తున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో "అత్తారింటికి దారేది" సినిమాలోని ఫేమస్ డైలాగుతో పవన్ కల్యాణ్ పై తనదైన రీతిలో సెటైర్ వేశారు అంబటి రాంబాబు. 24 నుంచి ఇప్పుడు 21 కి అసెంబ్లీ సీట్లు పడిపోవడంపై ఇలా రియాక్ట్ అయ్యారు.

ఇందులో భాగంగా... "ఎక్కడ నెగ్గాలో తెలియనోడు.. ఎక్కడ తగ్గాలో అసలు తెలియనోడు పవన్ కల్యాణ్" అంటూ స్పందించారు అంబటి రాంబాబు. దీంతో ఈ ట్వీట్ కింద కామెంట్ సెక్షన్ లో చిన్న సైజు యుద్ధమే జరుగుతుంది. ఇందులో భాగంగా కొంతమంది అంబటిపై కౌంటర్స్ వేస్తుంటే.. మరికొంతమంది మాత్రం లైకులు కొడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు.

కాగా... ఇటీవల పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ చేస్తారని.. తద్వారా మోడీ కేబినెట్ లో సెంట్రల్ మినిస్టర్ గా ఆఫర్ వచ్చిందని కథనాలొస్తున్న నేపథ్యంలోనూ అంబటి కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఒక ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... "సీఎం సీఎం అని అరిసిన ఓ కాపులారా! సీఎం అంటే చీఫ్ మినిస్టరా? సీఎం అంటే సెంట్రల్ మినిస్టరా? సీఎం అంటే చంద్రబాబు మనిషా? సిఎం అంటే చీటింగ్ మనిషా?" అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News