వైసీపీని వీడాక.. అంబటి మరో ఆసక్తికర ట్వీట్‌!

ప్రముఖ క్రికెటర్, కాపు సామాజికవర్గానికి చెందిన అంబటి రాయుడు వైసీపీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Update: 2024-01-07 18:18 GMT

ప్రముఖ క్రికెటర్, కాపు సామాజికవర్గానికి చెందిన అంబటి రాయుడు వైసీపీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఆయన వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఇంతలోనే రోజుల వ్యవధిలోనే వైసీపీ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించడం కలకలం రేపింది.

రాయుడు వైసీపీ నుంచి తప్పుకోవడంపై నెటిజన్లలో, వివిధ రాజకీయ పార్టీ శ్రేణుల మధ్య అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన వంటి పార్టీలు అంబటి రాయుడు వైసీపీ నుంచి తప్పుకోవడంపై సోషల్‌ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశాయి. వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ స్వభావం తెలుసుకోవడం వల్లే రాయుడు ఆ పార్టీకి రాజీనామా చేశారని టీడీపీ, జనసేన పేర్కొన్నాయి.

ఇక సాధారణ ప్రజల్లో, నెటిజన్లలో రకరకాల చర్చలు సాగాయి. గుంటూరు ఎంపీ సీటు ఇస్తామని ఆఫర్‌ ఇవ్వడం వల్లే అంబటి రాయుడు వైసీపీలో చేరారని, అయితే ఆ సీటును ప్రస్తుతం నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలకు వైఎస్‌ జగన్‌ కేటాయించారని టాక్‌ నడిచింది.

మరోవైపు గుంటూరు ఎంపీ సీటును ఇవ్వలేకపోతే గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ సీటును అంబటి రాయుడికి ఇస్తామని జగన్‌ ముందుగా హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. అయితే ఇప్పుడు దాన్ని కూడా కన్ఫర్మ్‌ చేయకపోవడం వల్లే అంబటి రాయుడు వైసీపీ నుంచి తప్పుకున్నారని ఊహాగానాలు వినిపించాయి.

అదేవిధంగా గుంటూరు ఎంపీగా పోటీ చేయాలంటే 120–150 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టుకోవాలని వైసీపీ అధిష్టానం అంబటికి సూచించిందని అందుకే ఆయన వైసీపీకి రాజీనామా చేశారని టాక్‌ నడిచింది.

ఈ నేపథ్యంలో అంబటి రాయుడు మరో ట్వీట్‌ లో తాను వైసీపీ నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్‌ లో పోస్టు చేశారు.

‘నేను అంబటి రాయుడిని. జనవరి 20 నుంచి దుబాయ్‌ వేదికగా జరిగే ఐఎల్టీ20లో ముంబై ఇండియన్స్‌ కి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ప్రొఫెషనల్‌ ఆటలో ఆడేందుకు నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధమూ ఉండకూడదు’ అని పేర్కొన్నారు. తద్వారా తాను ఐఎల్టీలో ఆడేందుకే వైసీపీ నుంచి తప్పుకున్నట్టు పరోక్షంగా వివరణ ఇచ్చారు.

కాగా వైసీపీని వీడుతూ అంబటి చేసిన పోస్టులో కొన్నాళ్లు తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తన తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News