ఎన్నో దేశాలను ముంచినా.. అమెరికా ఎన్నికల్లోనూ 'ఉచితాలు'

అంతేకాదు.. కొత్తకొత్త ఉచిత పథకాలను.. ఆఖరికి బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం పథకాలనూ తెచ్చాయి.

Update: 2024-10-14 00:30 GMT

ఉచిత పథకాలు (ఫ్రీ బీస్) ఇప్పుడు ప్రతి దేశంలోనూ ఓ పెద్ద సంచలనం. పేదలను ఆదుకునేందుకు.. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు రాజకీయ పార్టీలు ఫ్రీ బీస్ ను తమ అస్థ్రాలుగా వదులుతున్నాయి. ఒకప్పుడు పార్టీలు ఎన్నికల్లో.. డెవలెప్ మెంట్ విధానాలతో వెళ్లేవి. కాలక్రమంలో వాటి స్థానంలో ఫ్రీ బీస్ వచ్చాయి. వీటికి ఎంతకూ అడ్డుకట్ట ఉండడం లేదని ఆర్ధికవేత్తలు విమర్శిస్తున్నారు. భారత్ లోనే చూస్తే 20 ఏళ్ల కిందట రైతులకు ఉచిత విద్యుత్తు పథకం ప్రకటన పెద్ద సంచలనం. అప్పట్లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ సారథిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్తు పథకాన్ని ఇస్తామని ప్రకటిస్తే అందరూ నోరెళ్లబెట్టారు. ఇక దీన్నే ప్రస్తుతం అనేక రాష్ట్రాలు కొనసాగిస్తున్నాయి. అంతేకాదు.. కొత్తకొత్త ఉచిత పథకాలను.. ఆఖరికి బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం పథకాలనూ తెచ్చాయి.

లంక మునిగింది..

ద్వీప దేశం శ్రీలంకలో రెండేళ్ల కిందట అధ్యక్షుడిపై తీవ్రమైన వ్యతిరేకతతో తిరుగుబాటు జరిగింది. దీనికి కారణం.. ఉచిత పథకాలకు తోడు ఆయన విధానాలే అని పేర్కొన్నారు. ధరలు తీవ్రంగా పెరిగిపోవడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ నేపథ్యంలోనే అతిగా ఉచిత పథకాలను ఇస్తున్న రాష్ట్రాలను మరో శ్రీలంక కాబోతోందని ఎద్దేవా చేసేవారు. అయితే, లంకలో లాగానే కాకపోయినా అగ్రరాజ్యం అమెరికాలోనూ ఉచిత పథకాల ప్రస్తావన వస్తోంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

ఆకట్టుకునే మార్గం..

ఉచిత పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వాలు చెప్పే మాట.. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం. కానీ, ఆ మేరకు పథకాలు సమర్థంగా అమలు చేస్తున్నారా? అంటే చెప్పడం కష్టమే. కాగా, వచ్చే నెల 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ఉచిత పథకాల ఊసు వినిపిస్తోంది. అమెరికా అంటే అత్యున్నత జీవన ప్రమాణాల దేశం. 80 శాతం మంది విద్యావంతులే. రాజ‌కీయంగా చైత‌న్యవంతులు. ఎన్నికల్లో బాగా ఆలోచించి మరీ నిర్ణ‌యం తీసుకుంటారు. అలాంటిచోట ఉచితం అనేదానికి ప్రజలు ఊ కొడతారా? అంటే చెప్పలేం. పిల్లలు ఎదిగాక.. వారి కాళ్ల‌పై వారు నిల‌బ‌డే పద్ధతులు పాటించే పాశ్చాత్య దేశాల్లో.. భావ ప్ర‌క‌టన స్వేచ్ఛనే కాదు.. ఆర్థిక స్వేచ్ఛ కూడా ఎక్కువగా ఉండే అమెరికాలో ‘ఉచిత సంస్కృతి’ కొత్త‌గా వ‌చ్చింది.

హోరాహోరీ పోరులో..

అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రిప‌బ్లికన్‌, అధికార డెమొక్రాటిక్ అభ్య‌ర్థులు డొనాల్డ్ ట్రంప్‌, క‌మ‌లా హ్యారిస్ మ‌ధ్య పోటీ హోరాహోరీగా ఉంది. స‌ర్వేల్లో ఇద్ద‌రూ ఢీ అంటే ఢీ అన్న‌ పరిస్థితి కనిపిస్తోంది. ఓసారి క‌మ‌లా, మరోసారి ట్రంప్ పైచేయి సాధిస్తున్నారు. పోయినసారి అనూహ్యంగా ఓడిపోయానని భావిస్తున్న ట్రంప్.. ఇప్పుడు కచ్చితంగా గెలవాలని ‘ఉచితాల‌కు’ తెరతీశారు. అధికారంలోకి వ‌స్తే.. విద్యుత్ బిల్లుల ఖ‌ర్చులో 20 శాతం భ‌రిస్తామ‌నిప్రకటించారు. వాండ‌ర‌ర్స్‌ కు ఇస్తున్న ఫుడ్ స్టంట్స్‌ ను విద్యార్థులకూ విస్త‌రిస్తామ‌ని చెప్పారు. దీనిని భారత్ లో ఉచిత బియ్యం హామీతో పోల్చవచ్చు. ఇక ట్రాఫిక్ ఆంక్ష‌ల‌ను స‌డ‌లించ‌డంతోపాటు.. జరిమానాల సంస్కృతికి అడ్డుక‌ట్ట వేస్తామన్నారు. అమెరికాలో ట్రాఫిక్ రూల్స్ చాలా కఠినం అనే సంగతి తెలిసిందే. వాటి జరిమానాలతోనే బెంబేలెత్తుతుంటారు. ఈ నేపథ్యంలో ట్రంప్ హామీలు ఏ మేరకు గట్టెక్కిస్తాయో చూడాలి.

Tags:    

Similar News