అమెరికన్ ఎయి ర్ లైన్స్ బాత్ రూం లో కూడా ఇలా చేస్తారా?
ఈ ఘటన నార్త్ కరోలినా లోని షార్లెట్ నుంచి బోస్టన్ కు వెళ్తున్న విమానంలో చోటు చేసుకుంది.
విమానంలో జరుగుతున్న నేరాలు - ఘోరాలకు సంబంధించిన దారుణాలు రోజు రోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. గాల్లో ప్రాణాలు చేతపట్టి చేస్తున్న ప్రయాణం అనే సంగతి కాసేపు పక్కనపెడితే... అత్యంత సెక్యూర్డ్ గా, హుందాగా ఉండాల్సిన విమాన ప్రయాణంలో సైతం చిల్లర వ్యవహారాలు తెరపైకి వస్తున్నాయి.
ఇందులో భాగంగా విమానంలో ప్రయాణిస్తున్న ఒక బాలికకు టాయిలెట్ లో చేదు అనుభవం ఎదురైంది. భద్రత పరంగా ఎంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటాయని చెప్పే విమాన ప్రయాణంలో కూడా ఆ బాలిక ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ ఘటన నార్త్ కరోలినా లోని షార్లెట్ నుంచి బోస్టన్ కు వెళ్తున్న విమానంలో చోటు చేసుకుంది.
వివరాళ్లోకి వెళ్తే... అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం.. షార్లెట్ నుంచి బోస్టన్ కు బయలుదేరింది. ఆ సమయంలో ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఓ 14 ఏళ్ల బాలిక టాయిలెట్ కు వెళ్తుంది. ఈ సమయంలో ఆ టాయిలెట్ లోని సీటు విరిగిపోయిందని, ఫస్ట్ క్లాస్ వాష్ రూం ఉపయోగించాలని, సిబ్బందిలోని ఒక యువకుడు సూచించాడు.
దీంతో ఆ బాలిక సదరు యువ స్టాఫ్ సూచించిన వాష్ రూం కు వెళ్లింది. ఈ సమయంలో టాయిలెట్ ని ఉపయోగించిన తర్వాత సీటు వెనుక భాగంలో ఒక ఫోన్ అతికించి ఉండడాన్ని గమనించింది. వెంటనే వెంటనే తన ఫోన్ తో టాయిలెట్ లో అతికించి ఉంచిన ఫోన్ ను ఫొటో తీసింది. అనంతరం ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది.
దీంతో ఈ విషయంపై సీరియస్ అయిన ఆ బాలిక పేరెంట్... టాయిలెట్ లో రికార్డు చేయడానికే దానిని అమర్చారని ఆరోపించారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఫిర్యాదు చేశారు. దీంతో... లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు, పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతుందని తెలుస్తుంది.
మరోపక్క ఈ ఘటనపై అమెరికన్ ఎయిర్ లైన్స్ స్పందించింది. ఇందులో భాగంగా.. ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. తమ ప్రయాణికుల, సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని.. ఆ యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.