'కూటమి' ఎందుకు పెట్టారో.. చెప్పేసిన అమిత్ షా!
మరోవైపు వైసీపీ కూటమిపైనే కామెంట్లు చేస్తోంది. ఒక్కడిని చేసి ఇంత మంది వస్తున్నారంటూ.. సీఎం జగన్ వ్యాఖ్యలు సంధిస్తున్నారు.
ఏపీలో కూటమి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మరోసారి టీడీపీతో ఎందుకు చేతులు కలపాల్సి వచ్చింది? అనే విషయాలు ఇప్పటికీ క్షేత్రస్థాయిలో సందిగ్ధంగా ఉన్న మాట నిజం. అందుకే.. టీడీపీ అధినేత చంద్ర బాబు, జనసేన అధినేత పవన్‌లు.. తరచుగా ఈ విషయాలను తమ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. ఏ వేదికెక్కినా.. కూటమిఎందుకు పెట్టుకున్నారో చెబుతున్నారు. మరోవైపు వైసీపీ కూటమిపైనే కామెంట్లు చేస్తోంది. ఒక్కడిని చేసి ఇంత మంది వస్తున్నారంటూ.. సీఎం జగన్ వ్యాఖ్యలు సంధిస్తున్నారు.
దీంతో కూటమిగా ఎందుకు వస్తున్నారనే ప్రశ్న గ్రామీణ స్థాయిలో ఇంకా క్లారిటీ లేదన్నది వాస్తవం. మరోవైపు చూస్తే.. ఎన్నికలు కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చిన బీజేపీ అగ్రనేత.. అమిత్ షా కూడా.. తన ప్రసంగంలో పది నిమిషాలు(22 నిమిషాలు ప్రసంగించారు) కూటమిని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో వివరించారు. తాజాగా ఆయన బీజేపీ నేత, బీసీ నాయకుడు సత్యకుమార్ యాదవ్ పోటీ చేస్తున్న ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.
అమిత్ ఏమన్నారంటే..
+ ఏపీ ప్రజలకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా విఫలం అయ్యారు. అందుకే కటమి పెట్టుకున్నాం.
+ కేంద్ర నిధులు ఇచ్చినా.. జగన్ ప్రభుత్వం అవినీతితో వాటిని దుర్వినియోగం చేసింది.. అందుకే కూటమిగా వచ్చి.. అవినీతిని బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్నాం.
+ రాష్ట్రంలో గూండారాజ్ పెరిగింది. అవినీతి, అరాచకాలు పెరిగాయి. అందుకే కూటమి పెట్టుకున్నాం. మేం అధికారంలోకి రాగానే.. వాటిని అరికట్టేందుకు కూటమిలో కలిశాం.
+ రాష్ట్రంలో భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియాను నివారించడానికి పొత్తు పెట్టుకున్నాం.
+ తిరిగి అమరావతిని రాజధాని చేసేందుకే టీడీపీ, జనసేనతో చేతులు కలిపాం.
+ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి పవిత్రతను పున:స్థాపితం చేయడం కోసం, తెలుగు భాషను కాపాడేందుకే కూటమి పెట్టుకున్నాం.
+ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసేందుకే కూటమి పెట్టుకున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి. అని షా చెప్పుకొచ్చారు. మరిఇప్పుడైనా ప్రజలకు అర్ధమవుతుందో లేదో చూడాలి.