తొలిసారి అమూల్ పాలు ఇకపై అమెరికాలోనూ!
అమూల్ సంస్థను గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ నేత్రత్వంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే
ప్రైవేటు రంగంతో ప్రభుత్వ రంగ సంస్థలు.. ఉత్పత్తులు పోటీ పడలేవన్న మాట వినిపిస్తూ ఉంటుంది. కాకుంటే కొన్ని బ్రాండ్లు మాత్రం ప్రైవేటుకు ధీటుగా వ్యవహరిస్తుంటాయి. ఆ కోవలోకే వస్తుంది అమూల్. దేశ ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేని ఈ ప్రభుత్వ రంగ సంస్థ తొలిసారి తన పాలను అగ్రరాజ్యం అమెరికాలోనూ అమ్మేందుకు వీలుగా ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశంలో బలమైన నెట్ వర్కు ఉన్న అమూల్.. ఇప్పుడు అమెరికా మీద ఫోకస్ చేసింది. రానున్న వారం వ్యవధిలో నాలుగు వేరియంట్ పాలను విడుదల చేస్తున్నట్లుగా సంస్థ వెల్లడించింది.
అమూల్ సంస్థను గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ నేత్రత్వంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ తో పాటు ఆసియాకు చెందిన కుటుంబాల అవసరాల్ని తీర్చేందుకు వీలుగా ఆ సంస్థ పాల ఉత్పత్తుల్ని అమెరికాలోనూ అమ్మకాలు షురూ చేయనున్నారు. తొలిసారి అమెరికాలో అమూల్ పాలను అమ్మనున్నట్లుగా సంస్థ పేర్కొంది. దశాబ్దాల ఘన చరిత్ర ఉన్న అమూల్ తాజాగా అమెరికాలోని 108 ఏళ్ల చరిత్ర ఉన్న మిచిగాన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది.
అమూల్ తాజా.. అమూల్ గోల్డ్.. అమూల్ శక్తి.. అమూల్ స్లిమ్ అండ్ ట్రిమ్ వేరియంట్లు అమెరికా మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. తొలుత న్యూయార్క్.. న్యూజెర్సీ.. షికాగో.. వాషింగ్టన్.. డాలస్.. టెక్సాస్ తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ అమూల్ పాలు లభ్యమవుతాయని చెబుతున్నారు. తొలుత పాలతో మొదలయ్యే మార్కెటింగ్ రానున్న రోజుల్లో పన్నీర్.. పెరుగు.. మజ్జిగ లాంటి తాజా పాల ఉత్పత్తులను కూడా విడుదల చేయనున్నట్లుగా పేర్కొన్నారు. అమూల్ సంస్థ ఇప్పటివరకు దాదాపు 50 దేశాలకు పాల ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తుండగా.. తొలిసారి అమెరికాలో అమ్మకాలు చేపట్టనున్నారు. దేశీ పాల కోసం ఎదురుచూసే వారికి అమూల్ ఎంట్రీ స్వీట్ న్యూస్ గా చెప్పొచ్చు.