ఆనంద్ మహీంద్రా పిల్లలు ఏమి చేస్తుంటారు?

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ అయిన ఆనంద్ గోపాల్ మహీంద్రా గురించి దాదాపు అందరికీ తెలిసిందే. సాధారణంగా ఈయన్ని ఆనంద్ మహీంద్రాగా పిలుస్తారు

Update: 2023-09-30 04:48 GMT

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ అయిన ఆనంద్ గోపాల్ మహీంద్రా గురించి దాదాపు అందరికీ తెలిసిందే. సాధారణంగా ఈయన్ని ఆనంద్ మహీంద్రాగా పిలుస్తారు. మహీంద్రా & మహీంద్రా సహ వ్యవస్థాపకుడు జగదీష్ చంద్ర మహీంద్రా వారసుడు అయిన ఆనంద్‌ మహీంద్రా... నెట్‌ వర్త్‌ ఫోర్బ్స్ - 2023 నివేదిక ప్రకారం రూ. 21 వేల కోట్లకుపైనే!

అవును... 2.6 బిలియన్‌ డాలర్ల నెట్ వర్త్ కలిగిన ఆయన... సమకాలీన సామాజిక అంశాలపై సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారనేది తెలిసిన విషయమే. సోషల్ మీడియా వేదికగా గొప్పపనులను అభినందించడం, నూతన ఆలోచనలను ప్రోత్సహించడం ఈయన నిత్యకృత్యాల్లో ఒకటి అని చెప్పినా అతిశయోక్తి కాదు!

ఇక ఆయన వ్యక్తిగత జీవిత విషయానికొస్తే... ఆయన సతీమణి అనురాధ ఒక జర్నలిస్ట్. వివాహానికి ముందే వెర్వ్ అనే పత్రికను స్థాపించిన అనురాధ... ప్రస్తుతం వెర్వ్ తోపాటు మ్యాన్స్ వరల్డ్ మ్యాగజైన్‌ కు ఎడిటర్‌ గా ఉన్నారు. ఆనంద్ మహీంద్రా దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా... ఇద్దరు అల్లుళ్లూ విదేశీయులే కావడం గమనార్హం.

వీరి పెద్ద కుమార్తె దివ్య డిజైన్ అండ్‌ విజువల్ కమ్యూనికేషన్‌ లో 2009లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం వివిధ సంస్థలలో ఫ్రీలాన్సర్‌ గా, పార్ట్ టైం ఉద్యోగిగా పనిచేశారు. ఈ క్రమంలో 2016 ఫిబ్రవరిలో తన తల్లి ఎడిటర్ గా ఉన్న వెర్వ్ మ్యాగజైన్‌ లో ఆర్ట్ డైరెక్టర్‌ గా చేరారు. నాటి నుంచి నేటివరకూ ఆ పదవిలోనే కొనసాగుతున్నారు.

ఈమె న్యూయార్క్‌ లో మెక్సికన్ సంతతికి చెందిన ఆర్కిటెక్ట్ జార్జ్ జపాటాను వివాహం చేసుకున్నారు. ఇక రెండవ కుమార్తె ఆలికా కూడా పత్రికా రంగంలోనే కొనసాగుతున్నారు. ఇందులో భాగంగా ఈమె కూడా వెర్వ్‌ మ్యాగజైన్‌ లో పనిచేస్తున్నారు. ఈ మ్యాగజైన్ కు ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ గా ఉన్నారు.

ఈమె కూడా విదేశీయుడినే వివాహం చేసుకున్నారు. అవును.. ఆనంద్ మహీంద్రా రెండవ కుమార్తె ఆలికా ఫ్రెంచ్ జాతీయుడిని పెళ్లి చేసుకున్నారు. ఇలా తండ్రి వ్యాపారాలతో సంబంధం లేకుండా... పూర్తిగా తల్లి ఎంచుకున్న రంగంలోనే ఇద్దరు కూతురులూ కొనసాగుతుండటం గమనార్హం.

కాగా, ఆనంద్ మహీంద్రా... ఎయిర్‌ క్రాఫ్ట్, ఆటోమోటివ్, విడిభాగాలు, నిర్మాణ పరికరాలు, రక్షణ, ఎనర్జీ, అగ్రిబిజినెస్, వ్యవసాయ పరికరాలు, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్, పారిశ్రామిక పరికరాలు, సమాచార సాంకేతికత, హాస్పటాలిటీ, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, రిటైల్ మొదలైన అనేక వ్యాపారాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News