లేటెస్టు రిపోర్టు: విశాఖ.. విజయవాడలకు కాలుష్య మచ్చ
ఏపీలోని రెండు చిన్న నగరాలైన విశాఖపట్నం.. విజయవాడలలో వాయు కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంటున్నారు.
ఆంధ్రోళ్లకు బ్యాడ్ న్యూస్. తాజాగా విడుదలైన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనరజీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) నివేదిక విడుదలైంది. ఇందులోని గణాంకాల ప్రకారం గత సెప్టెంబరులో దేశంలోనే అతంయంత కలుషిత నగరాల జాబితాలో విశాఖపట్నం.. విజయవాడలు నిలిచాయి. ఇప్పటివరకు కాలుష్యం మహానగరాలకు మాత్రమే ఉంటుందని.. ఇందులో ఢిల్లీ.. హైదరాబాద్.. బెంగళూరు.. ముంబయి నగరాల్ని వేధిస్తూ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ విషతుల్య గాలి కారణంగా ఏడు శాతం అకాల మరణాలకు కలుషిత గాలి కూడా కారణంగా చెబుతుంటారు. ఈ జాడ్యం ఇప్పుడు చిన్న నగరాలకు పాకటం ఆందోళనకు గురిచేసే అంశం.
ఏపీలోని రెండు చిన్న నగరాలైన విశాఖపట్నం.. విజయవాడలలో వాయు కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. గత ఏడాది సెప్టెంబరులో దేశంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో ఈ రెండు నగరాలు చేరటం.. అందులో విశాఖపట్నం ఆరు రోజులు నిలిస్తే.. విజయవాడ మూడు రోజులు నిలవటం గమనార్హం. అంతేకాదు ఏపీలోని 26 నగరాలు.. పట్టణాల విషయానికి వస్తే ముప్ఫై రోజుల వ్యవధిలో టాప్ 67 లో కనీసం ఐదుసార్లు ఉండటం గమ నార్హం.
జాతీయ వాయు నాణ్యత ప్రమాణాల్ని అందుకోవటంలో ఏపీలోని పదమూడు పట్టణాలు విఫలమైనట్లుగా జాతీయ కాలుష్య మండలి చెబుతోంది. ఈ జాబితాలో విశాఖపట్నం.. విజయవాడలతో పాటు గుంటూరు.. కర్నూలు.. నెల్లూరు.. అనంతపురం.. చిత్తూరు.. ఏలూరు.. కడప.. ఒంగోలు.. రాజమహేంద్రవరం.. విజయనగరం.. శ్రీకాకుళం ఉన్నట్లుగా పేర్కొన్నారు.
దేశీయంగా 2026 నాటికి 131 నగరాలు/పట్టణాల్లో సూక్ష్మ ధూళికణాల సాంద్రతను 40 శాతం తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్రం జాతీయ వాయుశుద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలో.. పురోగతి లేకపోగా.. ఏపీలోని రాష్ట్రాలు.. పట్టణాల్లో పరిస్థితి మరింత దిగజారటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఘనపు మీటరు గాలిలో అతి సూక్ష్మ ధూళికణాల సాంద్రత 5 మైక్రో గ్రాములు మించకూడదు. కానీ.. రాష్ట్రంలో 30-45 మైక్రోగ్రాముల మధ్య ఉండటం చూస్తే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది.
అంటే.. నిర్ణీత ప్రమాణం కంటే ఆరు నుంచి తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉంది.నాసిరకం గాలిని పీల్చటం వల్ల రాష్ట్రంలో కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లోని ప్రతి మనిషిపై రోజుకు సగటున రెండు సిగిరెట్లు తాగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయో.. అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఉందని చెబుతున్నారు. అంతేకాదు.. సూక్ష్మ ధూళి కణాల సాంద్రత 15 మైక్రోగ్రాములు మించకూడదు. కానీ.. రాష్ట్రంలో ఇది నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.
2019 -20లో విశాఖపట్నంలో పీఎం2.5 వార్షిక సగటు 97 మైక్రోగ్రాములు ఉండగా.. 2023-24లో ఇది కాస్తా 120 మైక్రో గ్రాములకు చేరింది. అదే సమయంలో విజయవాలో 57 నుంచి 61 గ్రాములకు చేరింది. దీంతో జనాభాలో సగం కంటే ఎక్కువ మంది ప్రత్యక్షంగా వాయుకాలుష్యం బారిన పడుతన్నారు. దీని కారణంగా శ్వాసకోశ సమస్యలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. సో.. ఏపీ ప్రజలు పారాహుషార్.