ఏపీ అసెంబ్లీ మండ‌లి నిర‌వ‌ధిక వాయిదా.. ప‌ది రోజుల్లో ఏం చేశారు?

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు స‌హా శాస‌న మండ‌లి స‌మావేశాలు కూడా శుక్ర‌వారం సాయంత్రం నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డ్డాయి.

Update: 2024-11-23 05:01 GMT

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు స‌హా శాస‌న మండ‌లి స‌మావేశాలు కూడా శుక్ర‌వారం సాయంత్రం నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డ్డాయి. మొత్తం 11 రోజుల పాటు ఈస‌మావేశాలు జ‌రిగాయి. దీనిలో రెండు రోజుల పాటు సెల‌వులు తీసీస్తే 9 రోజుల పాటు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. న‌వంబ‌రు 11న ప్రారంభ‌మైన స‌మావేశాలు 22వ తేదీ వ‌ర‌కు కొన‌సాగాయి. ఈ నెల 11న తొలి రోజే ఉభ‌య స‌భ‌ల్లోనూ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టారు. మొత్తం 1.8 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌తో వ‌చ్చే నాలుగు మాసాల కాలానికి బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌డం గ‌మ‌నార్హం. అనంత‌రం ఒక రోజు సెల‌వు ఇచ్చారు.

బ‌డ్జెట్ పై చ‌ర్చ‌కు రావాలంటూ.. విప‌క్షం వైసీపీని ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు. అయితే.. వైసీపీ అధినేత జ‌గ‌న్ నిర్ణ‌యం మేర‌కు.. ఎవ‌రూ స‌భ‌కు రాలేదు. అయితే.. ఇంటి నుంచే మీడియాతో మాట్లాడుతూ.. స‌ర్కారు చేసిన విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్లు ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఇక‌, అసెంబ్లీ, మండ‌లి స‌మావేశాల్లో మొత్తం 21 కీల‌క బిల్లుల‌ను ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టి ఆమోదించుకుంది. ఆయా సంద‌ర్భాల్లో ఒక్క మండ‌లిలో మాత్ర‌మే సుదీర్ఘ చ‌ర్చ‌లు, విమ‌ర్శ‌లు, కౌంట‌ర్లు, వాకౌట్లు క‌నిపించాయి. ఎందుకంటే.. ఇక్క‌డ మాత్ర‌మే వైసీపీ స‌భ్యులు హాజ‌ర‌య్యారు.

సంప్ర‌దాయానికి పెద్ద‌పీట‌

అసెంబ్లీలో సంప్ర‌దాయానికి పెద్ద పీట వేసేందుకు స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు కృషి చేశారు. స‌మ‌య పాల‌న‌ను పాటించాల‌ని ఆయ‌న మంత్రులు, స‌భ్యుల‌కు ఒకింత క‌టువుగానే సూచించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ నుంచి ఎమ్మెల్యేల వ‌ర‌కుఎవ‌రూ స‌భ‌కు స‌రిగా రావ‌డం లేద‌ని తెలిపారు. అదేస‌మ‌యంలో సుదీర్ఘ చ‌ర్చ‌ల‌కు అవ‌కాశం లేకుండా అంద‌రికీ అవ‌కాశం ఇచ్చేలా స‌భ‌ను న‌డిపించారు.

క్యాంటీన్ భోజ‌నంపై..

ఏపీ అసెంబ్లీలో ఉన్న క్యాంటీన్‌లో భోజ‌నం బాగోలేదంటూ.. స్పీక‌ర్ అయ్య‌న్న నేరుగా వ్యాఖ్యానించారు. దీనిపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయ‌న్నారు. దీంతో అప్ప‌టిక‌ప్పుడు క్యాంటీన్ కాంట్రాక్ట‌ర్‌ను మార్చేసి.. నాణ్య‌మైన భోజ‌నాలు ఏర్పాటు చేసేలా చ‌ర్య‌లు తీసుకున్నారు.

ఉప స‌బాప‌తి ఎంపిక‌

ఈ స‌మావేశాల్లోనే అసెంబ్లీలో ఉప స‌భాప‌తిగా క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు(ఉండి ఎమ్మెల్యే)ను ఎంపిక చేశారు. ఆయ‌న‌ను సీఎం, డిప్యూటీ సీఎం, బీజేపీ ప‌క్షాన మంత్రి స‌త్య‌కుమార్ త‌దిత‌రులు పోడియం వ‌ర‌కు తీసుకువెళ్లి అభినందించారు.

60 గంట‌ల ప‌ని!

మొత్తంగా అటు అసెంబ్లీ, ఇటు మండ‌లి దాదాపు 60 గంట‌ల పాటు ప‌నిచేసిన‌ట్టు స‌చివాల‌యం ప్ర‌క‌టించింది. 75 ప్ర‌శ్న‌ల‌కు స‌భ్యులు స‌మాధానం ఇచ్చార‌న్నారు.

మండ‌లిలో మంట‌లు..

బ‌డ్జెట్ స‌హా ఇత‌ర అంశాల‌పై శాస‌న మండ‌లిలో చ‌ర్చ‌లు మంట‌లు రేపాయి. వైసీపీ స‌భ్యుల‌కు కౌంట‌ర్ ఇచ్చేందుకు ఏకంగా మంత్రులు ఎక్కువ సంఖ్య‌లో మండ‌లిలోనే తిష్ఠ వేశారు. ప్ర‌శ్న‌కు ప్ర‌శ్న‌, మాట‌కు మాట అన్న‌ట్టుగా మండ‌లిలో కార్య‌కలాపాలు కొన‌సాగాయి.

మ‌హిళా భ‌ద్ర‌త‌పైనే ఎక్కువ‌గా

అటు అసెంబ్లీ, ఇటు మండ‌లిలో మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌పై చ‌ర్చ‌కు ఎక్కువ‌గా అవ‌కాశం కల్పించారు. ఇదేస‌మ‌యంలో సోష‌ల్ మీడియా పోస్టుల‌పైనా విస్తృతంగా చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఈ క్ర‌మంలో మంత్రులు చేసిన వ్యాఖ్య‌లు ఇటు అసెంబ్లీలోను, అటు మండ‌లిలోనూ స్పీక‌ర్‌, చైర్మ‌న్‌ల ఆగ్ర‌హానికి గుర‌య్యాయి.

కొస‌మెరుపు:

స‌భ‌కు వైసీపీ అధినేత జ‌గ‌న్ రాక‌పోయినా.. ఆయ‌న గురించే ఎక్కువ‌గా ఉభ‌య స‌భ‌ల్లోనూ చ‌ర్చ సాగ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న స‌భ‌కు రావాలంటూ.. అసెంబ్లీలో మంత్రుల నుంచి స‌భ్యుల వ‌ర‌కు అంద‌రూ విన్న‌వించ‌డం విశేషం.

Tags:    

Similar News