అంట‌రానిత‌నానికి.. సీఎం జ‌గ‌న్ కొత్త నిర్వ‌చ‌నం

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా అంట‌రానిత‌నానికి కొత్త భాష్యం.. కొత్త నిర్వ‌చ‌నం చెప్పారు

Update: 2023-08-15 07:11 GMT

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా అంట‌రానిత‌నానికి కొత్త భాష్యం.. కొత్త నిర్వ‌చ‌నం చెప్పారు. 77వ స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని.. విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మునిసిప‌ల్ స్టేడియంలో నిర్వ‌హించిన ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా తొలుత ఆయ‌న జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. పేద‌ల‌కు ఇళ్లు ఇవ్వ‌కుండా అడ్డు కుంటున్నారంటూ.. ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకుప‌డ్డారు. ఇలా చేయ‌డం కూడా అంట‌రానిత‌న‌మేన‌ని కొత్త నిర్వ‌చ‌నం చెప్పారు.

పేదలు చదివే స్కూళ్లను పాడుబడేలా చేయడం, వాటిని ఆధునికీక‌రిస్తుంటే.. వాటిని కూడా అడ్డుకోవ‌డం అంటరానితనమేన‌ని సీఎం చెప్పారు. అంతేకాదు.. పేద కుటుంబాల‌కు చెందిన చిన్నారులు ఇంగ్లీష్‌ మీడియం చదువుకోవద్దని, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీషు మీడియాన్ని వ‌ద్ద‌ని చెప్ప‌డం.. దానిపై కోర్టులకు కూడా వెళ్ల‌డం వంటివి అంటరానితనమే అవుతుంద‌ని సీఎం జ‌గ‌న్ తేల్చి చెప్పారు. పేదలు వైద్యం చేయించుకునే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత సేవలు అందకుండా చేయడం కూడా అంటరానితన మేన‌న్నారు.

విప‌క్షాల అంట‌రాని త‌నం రాజ‌కీయాల‌పైనే తాము పోరాటం చేస్తున్నామ‌ని సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా తీసుకొని అన్ని హామీలను అమలు చేశామ‌న్నారు. రాష్ట్రంలో కొత్తగా 127 భారీ పరిశ్రమల ఏర్పాటు జ‌రుగుతోంద‌న్నారు. రాష్ట్రానికి రూ.67, 196 కోట్ల మేర‌కు పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని సీఎం వివ‌రించారు. శాశ్వత బీసీ కమిషన్‌ను నియమించిన తొలి రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింద‌న్నారు. 139 బీసీ కులాలకు 56 ప్రత్యేక కార్పోరేషన్లు ఏర్పాటు చేసి వారిని సాధికార‌త దిశగా న‌డిపిస్తున్నామ‌న్నారు.

గ‌డిచిన నాలుగు సంవ‌త్స‌రాల 2 మాసాల్లో అర్హులైన వారికి ఆయా ప‌థ‌కాల కింద‌ రూ. 2.31 లక్షల కోట్ల మేర‌కు లబ్ధి చేకూర్చిన‌ట్టు సీఎం జ‌గ‌న్ వెల్ల‌డించారు. 2 లక్షల 6 వేల 638 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జ‌రిగింద‌న్నారు. విద్యావ్యవస్థలో పలు సంస్కరణలు అమలు చేస్తున్నామ‌న్నారు. నాడు-నేడుతో 45 వేల ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్పు చేసిన‌ట్టు వివ‌రించారు. ప్ర‌భుత్వ స్కూళ్లలో ఇంగీష్‌ మీడియం అమలు చేశామ‌ని, దీనికిగాను పిశాచాల‌తోనే పోరాటం చేయాల్సి వ‌చ్చింద‌ని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News