నేతల సఖ్యత.. ఎండమావే: కూటమి లుకలుకలు.. !
కొన్ని నియోజకవర్గాల్లో పంపకాలు రగడకు దారితీస్తే.. మరికొన్ని చోట్ల ప్రొటోకాల్ వివాదాలు వస్తున్నాయి.
కూటమి పార్టీల మధ్య సఖ్యత కనిపించడం లేదు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు సుమారు 15 నుంచి 20 నియోజకవర్గాల్లో నాయకుల దూకుడు కనిపిస్తోంది. ఎవరికి వారే అన్నట్టుగా రాజకీయాలు చేసుకుంటున్నారు. విచ్చలవిడిగా ఎవరికి వారు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. దీంతో ప్రజల సమస్యల మాట ఎలా ఉన్నా.. వీరే పెద్ద సమస్యగా మారిపోతున్నారు. ఈ పరిణామాలు సహజంగానే.. కూటమి పార్టీలపై ప్రభావం చూపిస్తున్నాయి.
దీని నుంచి బయట పడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ వర్సెస్ జనసేన నేతల మధ్య వివాదాలు వస్తున్నాయి. మరికొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ వర్సెస్ బీజేపీ మధ్య చిచ్చు రగులుతూనే ఉంది. దీనిని సరిచేసేందుకు.. పై స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. ఈ చర్చలు కూడా ఆశించిన విధంగా జరగకపోవడం గమనార్హం. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు.. చర్చించేం దుకు ఇష్టపడడం లేదు.
ద్వితీయ స్థాయి నాయకులను రంగంలోకి దింపి వారితో చర్చలు చేస్తున్నారు. కానీ, వీరితో చర్చలు జరిపినా కూడా నాయకులు పెద్దగా శాంతించడం లేదు. తాజాగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, టీడీపీ ఇంచార్జ్‌కి మధ్య రగులుకున్న రగడపై టీడీపీ రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాసరావు, జనసేన నాయకులు హరిప్రసాద్ తదితరులు చర్చలు జరిపారు. పవన్-చంద్రబాబు మాదిరిగా పాలు తేనెలా కలిసి ఉండాలని సూచించారు. ఎక్కడా గొడవలకు దిగొద్దని చెప్పారు.
అదేవిధంగా మరో రెండు రోజుల పాటు ఈ వివాదాలు ఉన్న నియోజకవర్గాల నాయకులను విజయవాడకు పిలిపించి చర్చిస్తున్నారు. అయితే.. కీలకమైన సమస్యలను పరిష్కరించకుండా.. చర్చలపేరుతో కాల యాపన చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.అసలు రగడకు కారణాలు తెలుసుకుని, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాల్సి ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో పంపకాలు రగడకు దారితీస్తే.. మరికొన్ని చోట్ల ప్రొటోకాల్ వివాదాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చర్చలు అసంతృప్తులనే మిగులుస్తున్నాయి తప్ప పరిష్కారాలను కాకపోవడం గమనార్హం.