ఏపీని పగబట్టిన ప్రకృతి.. మరో రెడ్ అలర్ట్ జారీ

వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రత్యామ్నాయాల వైపు.. ఆదుకునే చేతుల వైపు ఆశగా చూస్తున్నారు.

Update: 2024-09-08 07:53 GMT

ఇప్పటికే వరదలు, వర్షాలతో వణికిపోతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి పిడుగులాంటి వార్త చెప్పింది. వారం రోజుల నాటి చేదు జ్ఞాపకాలు ఇంకా కళ్ల ముందే కదలాడుతున్నాయని, మళ్లీ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి దేవుడా అని ఆవేదన చెందుతున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రత్యామ్నాయాల వైపు.. ఆదుకునే చేతుల వైపు ఆశగా చూస్తున్నారు.

ఏపీలో గత వారం కురిసిన వర్షాలతో వచ్చిన వరదలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. బుడమనేరు బుంగలకు మరమ్మతులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ భారీ ఎత్తున వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని తెలిపింది. అటు.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేసింది. మరోవైపు.. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఆయా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం లేకపోలేదని చెప్పింది.

రానున్న రెండు రోజుల పాటు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని వెల్లడించింది. తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్ కర్ పుండ్కర్ స్పందించారు. అత్యవసర పరిస్థితుల కోసం స్థానిక అధికారులను అలర్ట్ చేశారు. 08942-240577 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఈ నెల 11 వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే విజయనగరం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రేగడి విలేజ్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో అటువైపు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇటు అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. చింతపల్లి మండలం కొత్తవీధిలో కాలువ ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి.

ఇక ప్రాజెక్టుల పరిస్థితి ఓసారి పరిశీలిస్తే.. శ్రీశైలం డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 2.80లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 3.09 లక్షల క్యూసెక్కులుగా ఉందని ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. నాగార్జున సాగర్ ఇన్‌ఫ్లో 2.99 లక్షల క్యూసెక్కులు వస్తోంది. పులిచింతలకు 2.75 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 2.97 లక్షల క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags:    

Similar News