'ఉచిత ఇసుక.. పూర్తిగా ఉచిత ఇసుక'... తేడా తెలుసా?
డిపో వద్ద టన్ను ఇసుకకు రూ.1,394 చెల్లించాలని అంత పెద్ద బోర్డు పెట్టి "ఉచిత ఇసుక" అని అంటారేంటంటూ ప్రజలు ఫైరయ్యారు.. నెటిజన్లు ట్రోల్ చేశారు.
నవ్యాంధ్రలో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ - బీజేపీ ప్రభుత్వం "ఉచిత ఇసుక" విధానాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత 2019లో అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. ఆ పాత విధానాన్ని రద్దు చేసి, కొత్త విధానం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా... ఇసుక తవ్వకాలను కాంట్రాక్టర్లకు ఇచ్చింది.
ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ సంస్థలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఇసుక టన్నుకు రూ.375 చొప్పున చెల్లించాలి. దానికి నిర్వహణ ఖర్చుల కింద అదనంగా మరో రూ.100 వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇక వాటికి రవాణా ఖర్చులు అదనం. అయితే ఏపీలో తాజాగా కూటమి ప్రభుత్వం కొలువుదీరింది.
దీంతో... ఆంధ్రప్రదేశ్ లో 2016 - 19 వరకూ అమలు చేసిన ఇసుక విధానాన్ని కూటమి ప్రభుత్వం మళ్లీ తీసుకొచ్చింది. దీన్ని "ఉచిత ఇసుక" విధానం అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. డిపో వద్ద టన్ను ఇసుకకు రూ.1,394 చెల్లించాలని అంత పెద్ద బోర్డు పెట్టి "ఉచిత ఇసుక" అని అంటారేంటంటూ ప్రజలు ఫైరయ్యారు.. నెటిజన్లు ట్రోల్ చేశారు.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుతం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇసుకను ఇకపై పూర్తిగా ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇసుకపై సీనరేజ్ రద్దు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటివరకూ సీనరేజ్, తదితరాల రూపంలో మెట్రిక్ టన్నుకు రూ.88 వసూలు చేసే విధానాన్ని రద్దు చేశారు!
ఈ నిర్ణయం అమలుకు సంబంధించి గనులశాఖ అధికారులతో సీఎం సోమవారం సమీక్ష నిర్వహించారు. బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం తెలపనున్నారు.
వాస్తవానికి సీనరేజ్ ఫీజు కింద మెట్రిక్ టన్నుకు వసూలు చేస్తున్న రూ.88లో... జిల్లా, మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు జమయ్యేది రూ.66 సీనరేజ్ ఫీజు కాగా.. జిల్లా ఖనిజ నిధికి చేరేది రూ.20, ఖనిజాన్వేషణ ట్రస్ట్ కు వెళ్లేది రూ.2! ఈ మొత్తం కలిపి రూ.88 ను ఇకపై వసూలు చేయరన్నమాట.
దీంతో... తమ తమ నిర్మాణ అవసరాల మేరకు నదీ సమీప గ్రామాలు, పట్టణాలకు చెందినవారు ఇసుక తవ్వి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుకను తీసుకెళ్లొచ్చు. ఒకవేళ సంబంధిత రీచ్ లలో కూలీలతో ఇసుక తవ్వించి లోడ్ చేయించాలనుకుంటే అక్కడ ఉన్న కాంట్రాక్టర్ కు ప్రభుత్వం నిర్ధేశించిన టన్నుకు రూ.90-100 చెల్లించాల్సి ఉంటుంది.