మోడీ మాటలు నమ్ముతారా ?
ఈ నేపధ్యంలో ఏపీని ఆదుకుంటామని అభివృద్ధి చేస్తామని డబుల్ ఇంజన్ సర్కార్ ని తీసుకుని రావాలని మోడీ చెబుతున్న మాటలు జనాలు ఎంత వరకూ నమ్ముతారు అన్నది చర్చకు వస్తోంది.
పదేళ్ళ పాటు కేంద్రంలో మోడీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఏపీలో చూస్తే రెండు ప్రభుత్వాలు మారాయి. రెండు ప్రభుత్వాలూ కేంద్రానికి సాయం చేస్తూ దోస్తులుగా ముద్రపడినవే తప్ప మిగిలిన రాష్ట్రాలలో మాదిరిగా విపక్ష పాత్ర పోషినవి కావు. ఇంకా చెప్పాలీ అంటే 2014 నుంచి 2018 దాకా ఎన్డీయేలో తెలుగుదేశం పార్టీ ఉంది.
ఈ విధంగా చూస్తే ఏపీ అభివృద్ధికి బీజేపీ రోజు ప్రవచిస్తున్న మాటలు అన్నీ ఏనాడో చేతలు కావాల్సి ఉంది. విశాఖ రైల్వే జోన్ అన్నది 2014లోనే అమలు కావాల్సింది. దానిని అయిదేళ్ళు సాగదీసి 2019 ఎన్నికల వేళ ఇచ్చేశామని చెప్పారు. ఇక 2024 ఎన్నికల వేళ చూస్తే ఏపీ ప్రభుత్వం భూములు ఇవ్వలేదని చెబుతున్నారు. అయిదేళ్ళ కాలంలో జోన్ నిర్మించడానికి కేంద్రానికి భూమి సమస్య మాత్రమే అడ్డుగా ఉందా అంటే బడ్జెట్ లో కేటాయింపులు చూస్తే జస్ట్ విదిలించినట్లుగానే ఉన్నాయి. దాదాపుగా అయిదు వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉన్న ఈ ప్రాజెక్ట్ కి కేంద్రం బడ్జెట్ లో పెట్టింది వందల కోట్లే అన్న మాట ఉంది.
పోలవరం ప్రాజెక్ట్ విషయం తీసుకుంటే 15 వేల కోట్లు ఇచ్చామని గొప్పగా చెబుతున్నారు. పోలవరం పూర్తి కావాలంటే అంతకు నాలిగింతలు నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అక్షరాలా అరవై వేల కోట్ల రూపాయలు అన్న మాట. సవరించిన బడ్జెట్ అంచనాలు ఆమోదించాలని మూడేళ్ళుగా కేంద్రాన్ని కోరుతున్నా దిక్కు లేదని అంటున్నారు. నాడే నిధులు ఇస్తే పోలవరం పూర్తి అయ్యేది కదా అన్న మాట ఉంది.
రాజధానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తామంటే తీసుకోలేదని కూడా అంటున్నారు. మరి ఇందులో వాస్తవాలు ఏమిటి అన్నది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే చెప్పాల్సి ఉంది. అయినా పదిహేను వేల కోట్లతో అమరావతి పూర్తి కాదు, మూడు రాజధానుల విషయం కోర్టులో ఉంది. సో అది కూడా చర్చకు వస్తున్న విషయం.
ఏపీకి నిధులు పెద్ద ఎత్తున ఇచ్చామని తరచూ కేంద్ర మంత్రులు చెబుతూ వచ్చారు. ఇపుడు మోడీ అమిత్ షా అంటున్నారు. ఏపీ నుంచి పన్నులు జీఎస్టీ రూపంలో వెళ్తున్నాయి. రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సినవే ఇచ్చారు తప్ప ఏనాడూ ఉదారంగా స్పెషల్ గ్రాంట్లు ఇవ్వలేదు. ఆఖరుకు అప్పులకు అనుమతులు ఇవ్వాలంటే కూడా కండిషన్లు పెట్టే తీరుగా వ్యవహరించారు అన్నది కూడా ప్రచారంలో ఉంది.
గతంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు రాష్ట్రాలను ఆదుకోవడానికి ప్రత్యేక నిధులు కొన్ని ఉదారంగా ఇచ్చేవి. మోడీ హయాంలో మాత్రం దయ తలిస్తే అప్పులు చేసుకోవడానికే అనుమతులు ఇస్తున్న పరిస్థితి ఉందని విపక్షాలు దేశవ్యాపతంగా విమర్శిస్తున్న నేపధ్యం ఉంది. ఏపీ విభజన వల్ల అన్ని రకాలుగా కునారిల్లి ఉంది. అటువంటి ఏపీకి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఆదుకోవాల్సింది ఉంది. కానీ దేశంలో ఇతర రాష్ట్రాలతో పాటుగా నిధులు ఇచ్చామంటే అవి పన్నుల ద్వారా వెళ్లిన ఆదాయం నుంచే కదా అన్నది అంతా అంటున్న మాట.
ఈ నేపధ్యంలో ఏపీని ఆదుకుంటామని అభివృద్ధి చేస్తామని డబుల్ ఇంజన్ సర్కార్ ని తీసుకుని రావాలని మోడీ చెబుతున్న మాటలు జనాలు ఎంత వరకూ నమ్ముతారు అన్నది చర్చకు వస్తోంది. ప్రత్యేక హోదా ఇస్తామని 2014 ఎన్నికల్లో చెప్పారు. కానీ అది ఆ తరువాత అటకెక్కింది. ఏపీ మీద నిజంగా ప్రేమ ఉంటే పదేళ్ళలో అద్భుతాలే జరిగేవి కదా అన్న నిర్వేదం అయితే సగటు జనాలలో ఉంది. ఈ రోజున బీజేపీకి కేంద్రంలో మూడవసారి అధికారం కావాలి. ఏపీ నుంచి ఎంపీలు కావాలి. అందుకోసం ఎన్నికల సభలలో ఇచ్చే హామీలను ఎంతవరకూ విశ్వసించవచ్చు అన్నది మాత్రం చర్చగానే ఉంది.