జనంలోకి జగన్.. భరోసా దక్కినట్లేనా ?

జగన్ మాత్రం ఐప్యాక్ టీములను నమ్మారు. తన చుట్టూ ఒక కోటరీ ఏర్పాటు చేసుకున్నారు. వారి సలహాలతో అంతా ముందుకు సాగారు.

Update: 2024-07-20 08:56 GMT

మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ చాలా కాలానికి జనంలోకి వచ్చారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంతా పరదాల మాటున ఉండేవారు. ఆయన సభలు అలాగే జరిగేవి. జగన్ ని దగ్గరగా చూసేందుకు ఎవరికీ చాన్స్ లేదు.

అలా గగన విహారం చేసి వచ్చి సభలో మాట్లాడేసి మళ్లీ వెళ్ళిపోయేవారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు జగన్ ని నేల మీదకు తెచ్చాయి. జగన్ పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్య తరువాత ఆ కుటుంబాన్ని పరామర్శించారు. జగన్ కారులోనే 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం ఒక మార్పు అయితే జగన్ కి జనంలో ఆదరణ బాగానే ఉందన్నది తెలియడం మరో విశేషం.

జగన్ నేల విడిచి సాము చేయడం వల్లనే గత ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. సీఎం అయ్యాక ఆ పదవిలో అలాగే ఉంటాను అనుకున్నారో లేక ఎన్ని సార్లు ఎన్నికలు పెట్టినా జనం తననే గెలిపిస్తారు అనుకున్నారో తెలియదు కానీ జనం వద్దకు ఆయన పోలేదు.

దాంతో జనాలకు జగన్ 2019 తరువాత కనిపించడమే లేదు అన్న అసంతృప్తి కూడా ఓటమికి కారణం అయింది ఏది ఏమైనా భారీ ఓటమి జగన్ కి వైసీపీకి కూడా ఏమి కోల్పోయామో తెలియచేసింది. నాలుగు గోడల మధ్య ఉంటే ఫీడ్ బ్యాక్ రాదు. ఒకవేళ సలహాదారులు ఎవరు ఇచ్చినా అది జనం ఫీడ్ బ్యాక్ కానే కాదు. గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ తెలియాలీ అంటే జనంలోనే ఉండాలి.

జగన్ మాత్రం ఐప్యాక్ టీములను నమ్మారు. తన చుట్టూ ఒక కోటరీ ఏర్పాటు చేసుకున్నారు. వారి సలహాలతో అంతా ముందుకు సాగారు. బటన్ మీకోసం వందల సార్లు నొక్కాను నా కోసం రెండు సార్లు నొక్కరా అని జగన్ అడిగినపుడే ఆయన అయిదేళ్ల పాలన ఏమిటి అన్నది ఆయనే చెప్పినట్లు అయింది. జనాలకు పధకాలు కావాలి. కానీ వాటితో పాటుగా ముఖ్యమంత్రిగా జగన్ కూడా కనిపించాలి.

కానీ ఇక్కడ జరిగింది మాత్రం వేరుగా ఉంది. అందుకే జనాలు ఓడించారు. విపక్షాలు అలుపెరగక తిరుగుతూ జనంలో ఉంటే జగన్ మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నారు అన్న విమర్శలు వారి బుర్రలోకి ఎక్కాయి. అలా జనాలకు దూరం అయిన జగన్ ఇన్నాళ్ళకు తిరిగి వారి వద్దకే వచ్చారు.

ఒక విధంగా చూస్తే తన బలం బలహీనతలు రెండూ జగన్ ఈ పర్యటనలో చూశారు అని అంటున్నారు. జనాలకు దూరం కావడమే తన బలహీనత అని ఆయన గ్రహించడం మొదలు పెడితే చాలు వైసీపీలో మార్పు తప్పకుండా వస్తుందని అంటున్నారు. అలాగే తన పట్ల ఆదరణ కనబరుస్తున్న జనాలకు ఎల్లప్పుడూ చేరువ కావాలని జగన్ చేసే ప్రతీ ప్రయత్నమూ సక్సెస్ అవుతుందని నిన్న పులివెందుల టూర్ నేడు వినుకొండ టూర్ చాటి చెప్పాయని అంటున్నారు.

ప్రజలతో మమేకం కావడం వారి పక్షాల పోరాటం చేయడం ద్వారానే జగన్ తాను పోగొట్టుకున్న అధికారాన్ని దక్కించుకోగలరు అని అంటున్నారు. అదే సమయంలో జగన్ వైసీపీ క్యాడర్ కి భరోసా ఇవ్వడానికి వస్తే జనాలు ఆయనకు కావాల్సినంత భరోసా ఇచ్చారు.

జనాలు ఓటు వేయలేదని లేదా వేసిన ఓట్లు ఏమయ్యాయి అని మధన పడడం నిన్నటి మాట. ఇపుడు జనాలలో ఉన్న అభిమానాన్ని ఎలా మళ్ళీ తన పార్టీ ఉన్నతికి ఉపయోగించుకోవాలి అన్నది జగన్ ఆలోచించాలని అంటున్నారు. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వానికి హామీల విషయంలో టైం ఇవ్వాలి.

అలాగే ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వారు రాష్ట్రపతి పాలన వంటి డిమాండ్లు చేయరు. కొత్త ప్రభుత్వం ప్రజలు భారీ తీర్పుతో అధికారం కట్టబెట్టారు. తప్పులు జరిగితే వాటికి చట్ట ప్రకారం శిక్షలు ఉండాలని డిమాండ్ చేయాలి తప్ప ఈ ప్రభుత్వం వద్దు అని తొలినాళ్ళలోనే కోరడం కూడా తప్పుడు సంకేతాలకు దారి తీస్తుంది అని గ్రహించాలి.

అంతే కాదు నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం పాత్ర పోషించడం ద్వారానే జనం మన్ననలు పొందాల్సి ఉంటుంది. ప్రభుత్వం చేసే మంచి పనులను మెచ్చుకుంటే వారు చేసే పొరపాట్లను విమర్శిస్తే విలువు పెరుగుతుంది. మొత్తం మీద చూస్తే జనం భరోసా అయితే జగన్ కి దక్కింది అని అంటున్నారు. ఆ మీదట ఆయన అడుగులు ఎలా ముందుకు సాగుతాయో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News