ఎంపీని దెబ్బయనున్న టీడీపీ అసమ్మతి...!?
ఈసారి బాగానే మెరుగుపడింది అని అంతా భావిస్తున్న తరుణంలో జిల్లాలో వర్గ పోరు కారణంగా పార్టీ అవకాశాలు చేజేతులా పోతున్నాయా అన్న చర్చ సాగుతోంది.
శ్రీకాకుళం జిల్లా అంటేనే టీడీపీకి కంచుకోట. వైఎస్సార్ టైం లో కూడా జిల్లాలో బాగానే సీట్లు ఆ పార్టీ సంపాదించుకుంది. అయితే 2019లో జగన్ వేవ్ బలంగా వీచడంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ సీట్లకు కేవలం రెండే టీడీపీకి దక్కాయి. ఈసారి బాగానే మెరుగుపడింది అని అంతా భావిస్తున్న తరుణంలో జిల్లాలో వర్గ పోరు కారణంగా పార్టీ అవకాశాలు చేజేతులా పోతున్నాయా అన్న చర్చ సాగుతోంది.
తెలుగుదేశం పార్టీ ఇటీవల రిలీజ్ చేసిన మూడవ విడత జాబితాలో సీనియర్లకు చెక్ పెట్టేశారు. శ్రీకాకుళం అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేయాలని చూసిన మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి టికెట్ ఇవ్వలేదు. పార్టీలో ఒక సర్పంచ్ గా ఉన్న గోండు శంకర్ కి టికెట్ ఇచ్చారు. దీంతో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో బలంగా ఉన్న లక్ష్మీదేవి వర్గం పూర్తి అసంతృప్తితో మండిపోతోంది.
ఆమె భర్త మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ ఎన్టీఆర్ హయాం ముంచి మంత్రిగా పనిచేసిన వారుగా ఉన్నారు. సీనియర్ మోస్ట్ లీడర్. మంచి లీడర్ గా ఉన్న ఆయన పట్ల శ్రీకాకుళం పట్టణంలో జనాల మొగ్గు ఉంది. ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందని పార్టీలకు అతీతంగా అంతా చర్చించుకుంటున్నారు. దీంతో అభిమానులు అనుచరులు అంతా ఇండిపెండెంట్ గా పోటీ చేయమని కోరుతున్నా అధినాయకత్వం పునరాలోచన చేస్తుందని గుండ కుటుంబం వేచి ఉంది.
అదే విధంగా పాతపట్నం సీటు విషయంలో మరో బలమైన రాజకీయ కుటుంబం కలమటను పక్కన పెట్టేశారు. అక్కడ మామిడి గోవిందరావు అనే కొత్త నేతకు టికెట్ ఇచ్చారు. దాంతో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వర్గం అక్కడ రోడ్డెక్కింది. పార్టీ కోసం అయిదేళ్ళుగా కష్టపడిన వారిని కాదని వేరే వారికి టికెట్లు ఇస్తారా అని కలమట అనుచరులు నిప్పులు చెరుగుతున్నారు.
ఇక ఈ ఇద్దరు అభ్యర్ధిత్వం పట్ల ప్రజలలో సానుకూలత ఉంది. అయితే టీడీపీ అధినాయకత్వం మాత్రం సర్వేల పేరు చెప్పి టికెట్లు ఇవ్వకుండా సైడ్ చేసింది. దాంతో అధినాయకత్వం మనసు మార్చుకుంటుందేమో అని ఈ రెండు నియోజకవర్గాల నుంచి ఈ నేతలు ఎదురుచూస్తున్నారు ఒకవేళ అలా చేయకుండా వారే అభ్యర్థులు అయితే మాత్రం ఈసారికి శ్రీకాకుళం పాపట్నం రెండు అసెంబ్లీ సీట్లలో ఓటమే కాకుండా ఏకంగా ఆ ప్రభావం శ్రీకాకుళం ఎంపీ సీటు మీద పడుతుందని అంటున్నారు.
హ్యాట్రిక్ విజయం సాధించాలని కింజరాపు రామ్మోహన్ నాయుడు చూస్తున్నారు. అయితే అటు శ్రీకాకుళం, ఇటు పాతపట్నం సీట్లు రెండూ తమకు రాకపోవడానికి కింజరాపు కుటుంబం చేసిన రాజకీయ వ్యూహమే అని ఆయన చోట్ల నేతల అభిమానులు భావిస్తున్నారు. దాంతో ఇండిపెండెంట్లుగా వారు పోటీ చేసినా లేక పార్టీలో సైలెంట్ గా ఉన్నా రెండు అసెంబ్లీ సీట్లతో పాటు ఎంపీ సీటు కూడా టీడీపీకి డౌటే అని అంటున్నారు. మరి టీడీపీ అధినాయకత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాలని అంటున్నారు.