ఏపీకి దూరంగా రాజగురువు

రుషీకేశ్ లో కూడా శారదా పీఠం ఉంది. ప్రతీ ఏడాది జూన్ తరువాత నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను స్వామి రిషీకేశ్ లో చేస్తారు.

Update: 2024-11-26 14:30 GMT

వైసీపీ హయాంలో దాదాపుగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి రాజ గురువుగా వ్యవహరించిన విశాఖ శారదా పీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర మహా స్వామి ఏకంగా ఏపీకే దూరంగా వెళ్ళిపోతున్నారు. ఆయన ఉత్తర భారతానికి తన కుటీరాన్ని మారుస్తున్నారు. రుషికేశ్ లో ఇక మీదట గడపాలని స్వామి నిర్ణయించుకున్నారు.

రుషీకేశ్ లో కూడా శారదా పీఠం ఉంది. ప్రతీ ఏడాది జూన్ తరువాత నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను స్వామి రిషీకేశ్ లో చేస్తారు. మిగిలిన ఎనిమిది నెలల కాలం అంతా ఆయన విశాఖలో ఉంటారు. అయితే ఇపుడు ఆయన మొత్తం తన ఆధ్యాత్మిక క్రతువులు అన్నీ కూడా అక్కడే నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

తాను రుషీకేశ్ వెళ్ళిపోతున్నానని అందువల్ల తనకు కేటాయించిన ఎక్స్ కేటగిరీ భద్రతను ప్రభుత్వం వెనక్కి తిరిరి తీసుకోవాలని స్వామి డీజీపీకి ఒక లేఖ రాశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక స్వామికి ఎక్స్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ వచ్చింది. కూటమి ప్రభుత్వం కూడా గడచిన ఆరు నెలల కాలంలో దానిని కొనసాగించింది.

అయితే ఇపుడు స్వామి ఏపీకే దూరంగా ఉండదలచడంతో తనకు భద్రత అవసరం లేదని లేఖ ద్వారా ప్రభుత్వానికి నివేదించారు. తనకు భద్రతను కల్పించినందుకు గానూ నాటి సీఎం జగన్ కి నేటి సీఎం చంద్రబాబుకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఇదిలా ఉంటే జగన్ ప్రభుత్వంలో స్వామి కీలకంగా వ్యవహరించారు అన్న ప్రచారం ఉంది. అంతే కాదు విశాఖను రాజధానిగా చేయాలన్న జగన్ ఆలోచనల వెనక కూడా స్వామి సలహాలు ఉన్నాయని అప్పట్లో ప్రచారం సాగింది. తూర్పున ఉన్న విశాఖ తీరం నుంచి రాజ్యం చేస్తే వైసీపీకి అన్నీ విజయాలే అని చెప్పినట్లుగా అంతా చెప్పుకున్నారు

అదే విధంగా ప్రతీ ఏటా శ్రీ శారదాపీఠంలో నిర్వహించే వార్షిక ఉత్సవాలకు కూడా ముఖ్యమంత్రి హోదాలో జగన్ వస్తూ ఉండేవారు. అదే విధంగా రాజశ్యామల యాగం జగన్ చేత స్వామి ఈ సందర్భంగా చేయించేవారు. వైసీపీకి సంబంధించి జగన్ కి ఆయన్ ఆధ్యాంతిక గురువుగా వ్యవహరించేవారు అని అంతా ప్రచారంలో ఉంది.

ఇక స్వామికి సంబంధించిన పీఠం కోసం భీమునిపట్నం వద్ద 15 ఎకరాల అతి ఖరీదు అయిన భూమిని కూడా వైసీపీ ప్రభుత్వం కేటాయించింది దాని విలువ రెండు వందల కోట్ల రూపాయల దాకా ఉంటుందని కూడా ప్రచారంలో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానిని వెనక్కి తీసుకున్నారు. అలాగే తిరుమలలో పీఠం నిర్మించిన భవనాలను కూడా కూల్చేస్తామని కూడా నిర్ణయించారు.

ఈ మొత్తం పరిణామాలతో స్వామి మనస్తాపం చెందారని అంటున్నారు. నిజానికి ఆయన ఈ ఏడాది నాగుల చవితి రోజున వచ్చే తన పుట్టిన రోజు తరువాత హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన శారదా పీఠానికి వెళ్ళాలని అక్కడే ఉండాలని నిర్ణయించారు. అయితే ఇపుడు ఆయన రుషీకేశ్ కే పయనం అవుతున్నారు. మొత్తానికి స్వామి ఏపీకి దూరంగా జరగడం మాత్రం చర్చనీయాంశం అవుతోంది.

మరో వైపు మాజీ సీఎం ఇటీవల విజయవాడలో ఉన్న శృంగేరీ పీఠాధిపతిని దర్శించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. దాంతో వైసీపీకి స్వామీజీకి మధ్య ఇక ఆధ్యాతిక బంధాలు ఉండవని కూడా ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా స్వామి తీసుకున్న ఈ నిర్ణయంతో ఇక మీదట శారదాపీఠంలో ఏ విధంగా వార్షిక ఉత్సవాలు కార్యక్రమాలు సాగుతాయన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News