బంగ్లాదేశ్ పోలీసుల అదుపులో ఇస్కాన్ ప్రతినిధి..!

బంగ్లాదేశ్‌లో హిందువులకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభుపై అక్కడి ప్రభుత్వం చర్యలకు దిగింది.

Update: 2024-11-26 09:42 GMT

బంగ్లాదేశ్‌లో హిందువులకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభుపై అక్కడి ప్రభుత్వం చర్యలకు దిగింది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కఠిన చర్చలు చేపట్టింది. ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి చిట్టగాంగ్ వెళ్లేందుకు చిన్నయ్ కృష్ణదాస్ ప్రభు హజ్రత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే పోలీసులు అక్కడ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఇస్కాన్ చిన్మయ్ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసాత్మక దాడులకు వ్యతిరేకంగా అనేక ర్యాలీలు నిర్వహించారు. చిన్మయ్ ప్రభు బంగ్లాదేశ్‌లోని సనాతన్ జాగరణ్ మంచ్ ప్రతినిధిగా కొనసాగుతున్నారు. మహ్మద్ యూనస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును సైతం ఖండించారు. ఈ క్రమంలోనే గత నెల 30న బంగ్లాదేశ్‌లో జాతీయ జెండాను అవమానించారు. లాల్దిఘిలో జరిగిన ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండా కంటే ఎక్కువ ఎత్తులో ఇస్కాన్‌కు చెందిన కాషాయరంగు జెండాను ఆవిష్కరించారు. అలాగే జాతీయ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకు గాను కృష్ణదాస్‌తోపాటు మరో 13 మందిపై దేశద్రోహ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే.. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు.

ఈ ఏడాది ఆగస్టులో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమాన్ని అణచేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ అప్పటి ప్రధాని షేక్ హసీనాక వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని పదవికి ఆమె రాజీనామా చేసి పారిపోయారు. ఆమె ప్రభుత్వం కూలిపోయిన తరువాత బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. ఇక అప్పటి నుంచి హిందువులు, ఇతర మైనార్టీలపై హింసాత్మక దాడులు జరుగుతున్నాయి.

గత అక్టోబర్ నుంచి చిట్టగాంగ్‌లో మైనార్టీల రక్షణ, హక్కులను డిమాండ్ చేస్తూ సనాతన్ జాగరన్ మంచ్ నిరసనలు చేపట్టింది. ఈ పోరులో చిన్మయ్ కృష్ణదాస్ కీలక పాత్ర పోషించారు. 8 ప్రధాన డిమాండ్లపై ఆయన పోరాటం చేశారు. బంగ్లాదేశ్‌లో ఉన్న మైనర్టీలపై దాడులు, నేరాలకు పాల్పడే వ్యక్తులను విచారించేందుకు ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని, బాధితులుగా మారిన వారికి పరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థలు, హాస్టళ్లలో మైనార్టీలకు ప్రార్థనా స్థలాలు, పూజా గృహాల నిర్మాణంపై గళం వినిపించారు. వీటన్నింటి నేపథ్యంలో చిన్మయ్ కృష్ణదాస్‌పై కేసులు నమోదు అయ్యాయి. తాజాగా.. ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. మరోవైపు.. కృష్ణదాస్ అరెస్టును నిరసిస్తూ పలు సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆయన్ను విడిపించాలని ఇస్కాన్ ఆలయ అధికారులు కోరారు.

Tags:    

Similar News