అనిల్‌ వర్సెస్‌ లోకేశ్‌.. రాజుకున్న రగడ!

కృష్ణా నది, బుడమేరు వరదలతో విజయవాడ విలయవాటికగా మారిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-03 10:00 GMT

కృష్ణా నది, బుడమేరు వరదలతో విజయవాడ విలయవాటికగా మారిన సంగతి తెలిసిందే. నగరంలో అత్యధిక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చిట్టి నగర్, సింగ్‌ నగర్, కబేళా, సితార సెంటర్, న్యూ రాజరాజేశ్వరిపేట తదితర ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి,

విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి భారీ ఎత్తున వరద వస్తోంది. ఈ క్రమంలో పడవలు ప్రవాహ వేగానికి కొట్టుకుపోయి ప్రకాశం బ్యారేజీ గేట్లకు గుద్దుకున్నాయి. దీంతో ఒక గేటు కొంతమేర ధ్వంసమైందని అంటున్నారు. మరోవైపు వరదలో రాజకీయాలు మాని బాధితులకు సహాయం చేయాల్సిన వైసీపీ, టీడీపీ నేతలు సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేసుకుంటుండటం చర్చనీయాంశంగా మారింది.

మాజీ జలవనరుల శాఖ మంత్రి, వైసీపీ నేత అనిల్‌ కుమార్‌ యాదవ్‌.. సోషల్‌ మీడియాలో నారా లోకేశ్‌ పై మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన వరదలకు కృష్ణా కరకట్టలో ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నివాసం మునిగింది. దీంతో జగన్‌ ప్రభుత్వం.. చంద్రబాబు నివాసాన్ని ముంచడానికే ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని విడుదల చేయకుండా భారీ ప్రవాహం వచ్చే వరకు ఎదురుచూశారని టీడీపీ నేతలు విమర్శించారు.

ఇప్పుడు ఇదే అంశాన్ని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఎత్తిచూపారు. తమ ప్రభుత్వ హయాంలో వరదలొస్తే చంద్రబాబు నివాసాన్ని ముంచడానికి తాము ప్రయత్నించామని లోకేశ్‌ ఆరోపించారని అనిల్‌ గుర్తు చేశారు. బ్యారేజీకి పడవలు అడ్డుపెట్టి నీటి ప్రవాహాన్ని అడ్డుకున్నామని ఆరోపణలు చేశారన్నారు. మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని.. అయినా చంద్రబాబు ఇల్లు ఎలా మునిగిందని నిలదీశారు. బ్యారేజీ వద్దకు పడవలు ఎలా కొట్టుకువచ్చాయని ప్రశ్నించారు.

‘‘ఏమయ్యా నారా లోకేశ్‌.. ఆరోజు కరకట్టపై మీ అక్రమ నివాసాన్ని ముంచడానికి బ్యారేజ్‌ గేట్ల మధ్యలో పడవలను అడ్డుపెట్టామని అన్నావు..

మరి ఇప్పుడు మీరే మీ ఇంటిని ముంచుకోవడానికి పడవలు అడ్డు పెట్టుకున్నారా...? మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం కాదు..

ఆ బోట్లను త్వరగా తీసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి’’ అని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఎక్స్‌ లో పోస్టు చేశారు. ఈ పోస్టుకు అప్పట్లో నారా లోకేశ్‌ చేసిన ట్వీట్‌ ను, బ్యారేజీ వద్ద అడ్డంగా ఉన్న పడవల ఫొటోలను జత చేశారు.

ఈ నేపథ్యంలో అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పోస్టుకు టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలు కౌంటర్‌ ఇస్తున్నారు. పోలవరాన్ని సర్వనాశనం చేసింది చాలక ఇంకా మాట్లాడుతున్నావా అని మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నావ్‌.. ఇంకా తప్పుకోలేదా అని నిలదీస్తున్నారు. బాధితులకు సాయం చేయాల్సిన సమయంలో ఈ రాజకీయ విమర్శలేంటని ధ్వజమెత్తుతున్నారు.

Tags:    

Similar News