వారాహి పెట్రోల్ కూడా దండగే: అనిల్ కుమార్
ఈ నేపథ్యంలోనే తాజాగా జనసేనాని పవన్ పై మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఉత్తరాంధ్ర వారాహి విజయ యాత్రలో భాగంగా గాజువాకలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ప్రభుత్వంపై సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఋషికొండపై నివాసం ఉండటానికి జగన్ ఏమన్నా దేవుడా? జగన్ ను పులివెందుల తరిమికొడతాం అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్ పై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ప్రతి విమర్శలకు దిగారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జనసేనాని పవన్ పై మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
పవన్ వారాహి వాహనానికి పెట్రోల్ దండగ అని, ఆ మాటల వల్ల ఆయనకు శ్రమ దండగ అని అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు. పవన్ మాట్లాడేది, చెప్పేది ఏదీ జరగదని, 2024లో జగన్ ఒక్కరే అందర్నీ ఓడించి హైదరాబాద్ కు పంపిస్తారని జోస్యం చెప్పారు.
పవన్ ఓటమి ఖాయమని, కానీ పవన్ కి జై కొడుతూ పిల్ల సైనికులు తమ భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారని అన్నారు. పవన్ ఫ్యూచర్ కే క్లారిటీ లేదని, అటువంటిది ఆయన జనసైనికులకు, అభిమానులకు ఏం భరోసానిస్తాడని అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు. అభిమానం అంటూ యువకులు తమ జీవితాలను పవన్ వెంట తిరిగి నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.
తనపై అభిమానంతో వస్తున్న యువకులను పవన్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. పవన్ వెంట బైకులు వేసుకొని ఇళ్లల్లో తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీ ఖర్చు పెట్టి జీవితాలు నాశనం చేసుకోవద్దని, 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉన్న విలువైన సమయాన్ని పవన్ వెంట తిరిగి వృధా చేసుకోవద్దని సూచించారు. ఈ పీక్ ఏజ్ లో తమ కెరీర్ పై దృష్టి పెట్టి మంచి ఉద్యోగాలు చేసుకోవాలని అన్నారు.
చంద్రబాబు, పవన్ కట్టగట్టుకుని వచ్చినా జగన్ వెంట్రుక కూడా టచ్ చేయలేరని, జగన్ ని ఆటాడించే దమ్ము ధైర్యం ఉన్న మగోడు ఏపీలో పుట్టలేదని అన్నారు. నవ్వుతూ కామ్ గా ఉన్నాడని, జగన్ ఏమీ చేయడని అనుకోవద్దని అన్నారు. దేశంలో ఎంతోమంది కీలక నేతలను గడగడలాడించిన సీఎం జగన్ అని అనిల్ కుమార్ అన్నారు. సోనియా గాంధీని చూసి దేశమంతా భయపడుతున్న సమయంలోనే ఆమెనే భయపెట్టిన వ్యక్తి జగన్ అని చెప్పారు.