అన్న క్యాంటీన్ల మెనూ మారింది.. ఎప్పటి నుంచంటే!
ఏపీలో పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది
ఏపీలో పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. గత చంద్రబాబు హయాంలో విస్తృతంగా పేదలకు సేవలు అందించిన ఈ క్యాంటీ న్లను మరో రెండు మాసాల్లో సెప్టెంబరు నుంచి ప్రారంభించాలని తాజాగా మంత్రి వర్గం ప్రతిపాదించింది. దీనికి సంబంధించి.. గత విధానాల స్థానంలో మరింత విస్తృత విధానాలను తీసుకురావాలని నిర్ణయిం చింది. గతంలో కేవలం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించేవారు.
అయితే.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మిల్లెట్ల(తృణ ధాన్యాలు)కు ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో అన్నంతో పాటు.. మిల్లెట్లకు సంబంధించిన రాగి సంగటి, జొన్న రొట్టెలు, రాగి ముద్ద, సజ్జలతో తయారు చేసే వంట కాలను కూడా ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. వీటిని విడిగా విక్రయించనున్నారు. అదేవిధంగా జావలకు కూడా.. ప్రాధాన్యం ఇవ్వనున్నారు. గతంలో ఉదయం ఉప్మా,ఇడ్లీ, సాంబారు, దోశలకు ప్రాధాన్యం ఇచ్చారు. మధ్యాహ్నం భోజనం అందించారు.
ఇప్పుడు వాటిని కొనసాగిస్తూనే.. మరిన్ని పదార్థాలను మెనూలో చేర్చాలని మంత్రి వర్గం నిర్ణయించడం విశేషం. ఇక, గత చంద్రబాబు హయంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ల భవనాలను జగన్ హయాంలో వేరే ఇతర అవసరాలకు వినియోగించారు. మరికొన్నింటిని కూల్చేశారు. ఇంకొన్ని పాడుపడ్డాయి. ఇప్పుడు అవే ప్రాంతాల్లో నూతన క్యాంటీన్లను ప్రారంభించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. దీనిని గతంలో మాదిరిగా హరేకృష్ణ సేవా సంఘానికి లీజుకు ఇవ్వాలని భావించినా.. అంతర్జాతీయ స్థాయిలో మరింత నాణ్యమైన ఆహార పదార్థాలు అందించే సంస్థను అన్వేషించాలని భావిస్తున్నారు.
సెప్టెంబరు రెండు లేదా నాలుగో వారంలో అన్నా క్యాంటీన్లు పున ప్రారంభించనున్నారు. గతంలో రూ.5కే నాణ్యమైన భోజనం అందించగా.. ఇప్పుడు పెరిగిన ధరలు, కాంట్రాక్టు సంస్థలు కోట్ చేసే ధరలను బట్టి.. రూ.10 వరకు పెంచే అవకాశం ఉందని మంత్రి వర్గం తెలిపింది. అయితే, రూ.5కే అందించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 183 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. మిగతా 20 అన్నా క్యాంటీన్లను తర్వాత.. విడతల వారీగా ప్రారంభిస్తారు.