అన్నా క్యాంటీన్ ధరలు చూస్తే షాక్ !
చాలా మంది నిరుద్యోగ యువత కోచింగులకు వెళ్ళి వస్తూ తమ భుక్తి కోసం అన్నాక్యాంటీన్లకు వెళ్ళేవారు.
అన్నా క్యాంటీన్లు అని చంద్రబాబు 2018 జూలైలో ప్రారంభించారు. ఆనాడు ప్రతీ జిల్లా కేంద్రంలో ఎంపిక చేసుకున్న ప్రాంతాలలో వాటిని నిర్వహించారు. రద్దీ ఎక్కువగా ఉండే చోట్ల వాటిని నిర్వహించారు. నిజంగా ఆనాడు ఇవి ఎంతో మంది ఆకలి తీర్చేవి.
చాలా మంది నిరుద్యోగ యువత కోచింగులకు వెళ్ళి వస్తూ తమ భుక్తి కోసం అన్నాక్యాంటీన్లకు వెళ్ళేవారు. అలాగే కూలీ నాలీ చేసుకునే వారు, పని మీద ఊరికి వచ్చిన వారు ఇలా ఒకరేమిటి అంతా కూడా అన్నా క్యాంటీన్లలో భోజనం టిఫిన్లు చేసి ఆకలి చల్లార్చుకున్న వారే.
నిజంగా తొమ్మిది నెలల పాటు టీడీపీ ప్రభుత్వం నడిపింది కానీ బ్రహ్మాండమైన రెస్పాన్స్ అయితే వచ్చింది. పేదల ప్రభుత్వం అని అధికారంలోకి వచ్చిన జగన్ వీటిని మూసేసి పెద్ద తప్పు చేశారు అని అంతా అనుకున్నారు. అదే ఫలితాల వల్ల నిజం అయింది. ఇపుడు అన్నా క్యాంటీన్లను తెరవడాన్ని అంతా స్వాగతిస్తున్నారు.
అయితే వాటి ధరలు చూస్తేనే షాక్ కొట్టేలా ఉన్నాయి. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ మీద సంతకం చేసిన చంద్రబాబు అనంతరం మీడియాతో మాట్లాడుతూ టిఫిన్ అయిదు రూపాయలు పగలు, రాత్రి భోజనం అయిదు రూపాయలు గా అందిస్తామని చెప్పారు.
ఇక్కడే అంతా ఆశ్చర్యపోతున్నారు. 2018లో రేట్లు ఇవే. అపుడే చాలా కారు చౌకగా ఉన్నాయని అనుకున్నారు. ఇప్పటికి ఆరేళ్ళు అవుతోంది. ఆహార ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. ధరలు పెరిగాయి. ఏది ముట్టుకున్నా కనీసంగా పాతిక ముప్పయి రూపాయలుగా రేట్లు ఉన్నాయి.
ఈ నేపధ్యంలో అన్నా క్యాంటీన్లను కేవలం అయిదు రూపాయలకే నడపడం వల్ల ఆర్ధిక భారం పెద్ద ఎత్తున పడుతుందని అంతా అంటున్నారు. ఈ రోజున భోజనం కనీసంగా డెబ్బై నుంచి ఎనభై రూపాయలకు తక్కువ లేదు అలాగే టిఫిన్ కనీసంగా ముప్పయి నుంచి నలభై రూపాయలు ఉంది.
అలా బయట ధరలు ఉన్న నేపధ్యంలో సబ్సిడీకి ఈ క్యాంటీన్లు ప్రభుత్వం నడుపుతోంది. ఎంతలా సబ్సిడీ ఇచ్చినా మరీ ఆకాశానికి పాతాళానికి మధ్య అంతరం అన్నట్లుగా ఉండకూడదు కదా అంటున్నారు. పైగా ఏపీలో ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నాయి. అప్పుల కుప్పగా రాష్ట్ర ఉంది వీటిని దృష్టిలో ఉంచుకుని టిఫిన్ ధరను కనీసంగా పది నుంచి పదిహేను రూపాయలు భోజనం ధరను ఇరవై నుంచి పాతిక రూపాయలు పెడితే బాగుంటుంది అని అంటున్నారు.
ఇలా ధరలు ఉంచినా సబ్సిడీ భారం ప్రభుత్వానికి ఏమీ తక్కువ ఉండదు, కాకపోతే ఎంతో కొంత ఆర్ధికంగా వెసులుబాటు ఉంటుంది. ఇక ఈ ధరలు కూడా సామాన్యులు భరించేవే అని అంటున్నారు. 2018 నాటికి ఇప్పటికీ ధరలు అన్నీ పెరిగిన నేపధ్యంలో అన్నా క్యాంటీన్ల ధరలు కూడా సవరించి అమలు చేస్తే ఖజానాకు ఎంతో కొంత ఊరటగా ఉంటుందని అంటున్నారు.
సంక్షేమం చేయాలి కానీ మరీ అప్పులు తెచ్చి చేయడం తప్పు అని జగన్ పాలనలో రుజువు అయింది ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు కూడా ఈ విషయంలో ఎక్కువగా ఉదారత చూపిస్తే అది ఏపీ ప్రగతికి ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు. ఏది ఏమైనా అన్నా క్యాంటీన్ రేట్లు షాక్ కొడుతున్నాయని అంతా అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏమి ఆలోచిస్తుందో చూడాల్సి ఉంది.