ఓర్నీ.. చంద్రబాబు పేరుతో మరో ఫేక్ లెటర్!
అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియాను ఇష్టారాజ్యంగా వాడేస్తున్న కొందరు అతిగాళ్లు.. తమకు తోచినట్లుగా విషయాల్ని వైరల్ చేసేస్తున్నారు.
తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల వేడి ఏపీలోనూ రగులుతోంది. అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియాను ఇష్టారాజ్యంగా వాడేస్తున్న కొందరు అతిగాళ్లు.. తమకు తోచినట్లుగా విషయాల్ని వైరల్ చేసేస్తున్నారు. తమకు వచ్చిన పోస్టులు నిజమైనవా? నకిలీవా? అన్న విషయాన్ని పట్టించుకోకుండా ఎవరికి వారు షేర్ చేయటంతో నిజం నిదానంగా.. అబద్ధం అత్యంత వేగంగా వైరల్ గా మారిపోతూ.. తప్పుడు సమాచారంతో మునిగితేలే పరిస్థితి నెలకొంది. తాజాగా అలాంటి లేఖ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏపీ విపక్ష నేత.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పేరు మీద.. తెలుగు దేశం పార్టీ విడుదల చేసినట్లుగా ఉన్న ఒక ఫేక్ లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో.. చంద్రబాబు నేరుగా ‘నాతోటి కమ్మ సామాజిక వర్గ ప్రజలకు’’ అని పేర్కొటూ లేఖ రాసినట్లుగా పేర్కొన్నారు. అందులో తెలంగాణ కాంగ్రెస్ కు ఈసారి ఎన్నికల్లో ఓటు వేయాలని.. తెలంగాణ కాంగ్రెస్ ను శాసిస్తున్నది తెలుగుదేశం నాయకులేనని.. అందుకే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి.. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరుతున్నట్లుగా అందులో పేర్కొన్నారు.
ఒక సీనియర్ రాజకీయ నేతగా తనకు జరిగిన అవమానం జీర్ణించుకోలేనిదని.. ప్రభుత్వం పెడుతున్న కేసుల నుంచి బయటకు రావాలంటే మరింత సమయం అవసరం అవుతుందని పేర్కొన్నారు. తాను మరోసారి జైలుకు వెళ్లినా కమ్మ సోదరులు తమ పోరాటాన్ని ఆపొద్దని.. ‘‘మన సామాజికవర్గం ఏకమైతే ఈ ప్రపంచాన్ని కూడా ఏలవచ్చు. అంతటి సామర్థ్యం మనకు ఉంది’’ అంటూ ఇష్టారాజ్యం రాతలతో తయారు చేసిన లేఖకు చివర్లో చంద్రబాబు సంతకాన్ని పోలే ఫేక్ సంతకంతో ప్రెస్ నోట్ తయారు చేశారు.
ఏ రాజకీయ పార్టీ అధినేత అయినా.. తాను ప్రాతినిధ్యం వహించే కులాన్ని.. ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రత్యేకంగా లేఖ రాయటం.. పరిమిత సంఖ్యలో ఉన్న సభలోనూ చేయలేని వ్యాఖ్యల్ని.. ఓపెన్ లెటర్ లో పేర్కొని విడుదల చేయటం ఎవరూ చేయరు.కానీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబును ముడి పెట్టి.. మరింత డ్యామేజ్ చేసేచర్యల్లో భాగంగానే తాజాగా ఫేక్ లేఖను వైరల్ చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.