రాజ్ భవన్ కా...రాజకీయ పార్టీ కోసమా ?

దాంతో ఆయన రాజకీయ పయనం ఎటు అన్న చర్చ మొదలైంది.

Update: 2024-09-25 12:30 GMT

తెలుగు రాష్ట్రాలలో బీసీ నేతగా పాపులర్ అయిన ఆర్ క్రిష్ణయ్య వైసీపీతో బంధం తెంచుకున్నారు. ఆయన వైసీపీ నుంచి సంక్రమించిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దాంతో ఆయన రాజకీయ పయనం ఎటు అన్న చర్చ మొదలైంది.

క్రిష్ణయ్య బీజేపీలో చేరుతారు అని ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. ఆయన రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యత్వం ఇంకా నాలుగేళ్ల పాటు ఉంది. పెద్దల సభలో క్రిష్ణయ్య ఉండాలనుకోవడం గొప్ప గౌరవం. మరి ఆ ఎంపీ పదవిని ఆయన తిరిగి కూటమి ఖాతాలో తీసుకుంటారా లేక వేరే పదవులు ఆయనకు ఇస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. అయితే విస్తృతంగా జరుగుతున్న మరో ప్రచారం ఏంటి అంటే క్రిష్ణయ్య గవర్నర్ పదవి కోసం చొస్తున్నారు అని.

అంటే బీజేపీలో చేరి ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా వెళ్లాలని ఆయన చూస్తున్నారు అని అంటున్నారు. అలా ఆయన వదిలేసిన రాజ్యసభ ఎంపీ పదవికి బీజేపీ తగిన వారిని ఎంపిక చేసి పంపిస్తుంది అని అంటున్నారు. ఇక క్రిష్ణయ్య గవర్నర్ గా రాజ్ భవన్ లో ఉండాలని కోరుకుంటున్నారు అని అంటున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. దాంతో వివిధ రాష్ట్రాలలో గవర్నర్ పదవులు ఖాళీ అయితే వాటిని బీజేపీ తమ నాయకులతో భర్తీ చేస్తుంది. అలా క్రిష్ణయ్యకు కూడా అవకాశం దక్కవచ్చు అని అంటున్నారు.

ఇటీవల కాలంలో గవర్నర్ పదవి అన్నది వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. దాంతో బీజేపీకి తలనొప్పిగా ఉంది. అయితే ఆర్ క్రిష్ణయ్య ప్రముఖ బీసీ నేతగా ఉన్నారు. వివాదాలకు దూరంగా ఉంటున్నారు. కాబట్టి ఆయనకు గవర్నర్ పదవి ఇచ్చి బీసీని గౌరవించామని చెప్పుకోవచ్చు అని చూస్తున్నారు అని అంటున్నారు.

అలాగే తెలంగాణాలో బీసీలను ఆకట్టుకునేందుకు కూడా చూస్తున్నారు అని అంటున్నారు. ఇక ఆయనను ఒక పెద్ద రాష్ట్రానికి గవర్నర్ గా నియమిస్తారు అని కూడా ప్రచారం సాగుతోంది. క్రిష్ణయ్య బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు అని అంటున్నారు.

అయితే ఆయనను కాంగ్రెస్ నాయకులు కూడా కలుస్తున్నారు. మల్లు రవి లాంటి వారు వచ్చి కాంగ్రెస్ లో చేరమని కోరుతున్నారు. దాంతో క్రిష్ణయ్య తన ఆప్షన్లు అన్నీ దగ్గర పెట్టుకుని సరైన చాన్స్ కోసం చూస్తున్నారు అని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే తనను సొంతంగా ఒక రాజకీయ పార్టీ పెట్టమని అంతా ఒత్తిడి తెస్తున్నారు అని క్రిష్ణయ్య చెప్పడం విశేషం. పార్టీ పెట్టేందుకు ఇదే సరైన సమయం అని కూడా ఆయన అంటున్నారు. దాంతో పార్టీ ఏర్పాటు మీద కసరత్తు చేస్తున్నాను అని క్రిష్ణయ్య చెబుతున్నారు. అయితే పార్టీ స్థాపన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా ఆయన అంటున్నారు.

మరో వైపు చూస్తే తాను రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి కారణం బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడం కోసమే అని అంటున్నారు. కానీ వైసీపీ మద్దతుదారులు అయితే ఆయన నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. వైసీపీకి క్రిష్ణయ్య వెన్నుపోటు పొడిచారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఆర్ క్రిష్ణయ్య రాజీనామా మాత్రం తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతోంది. ఆయన అడుగులు ఎటు పడబోతున్నాయి అన్నది కూడా అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

Tags:    

Similar News