వైసీపీకి మరో బిగ్ షాక్... ఎంపీ సంజీవ్ రాజీనామా!
ఇప్పటికీ ఈ జాబితాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఉండగా... ఎంపీలు చేరుతున్నారు.
కారణం ఏదైనా, సమస్య మరేమైనా ఇన్ ఛార్జ్ ల మార్పు చేపట్టడం, ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీలో రాజీనామాల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికీ ఈ జాబితాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఉండగా... ఎంపీలు చేరుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా కర్నూలు జిల్లా ఎంపీ సంజీవ్ కుమార్ ఎంపీతోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానీకీ రాజినామా చేస్తున్నారు! ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైఎస్సార్సీపీ పార్టీ, ఎంపీ పదవులకు రాజీనామా చేస్తున్నారు! ఈ సందర్భంగా ఆయన వైసీపీ అధినేత జగన్ అనుసరిస్తున్న విధానాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తాను ఏమి అడిగినా... ఎమ్మెల్యేలకు చెప్పమంటున్నారని అన్నారు. ఇదే సమయంలో... ఇక ఎంపీ ఎందుకని ప్రశ్నించారు.
నియోజకవర్గంలో ఏ విషయంపై మాట్లాడటానికి వెళ్లినా, ఏ విషయం అడిగినా... "ఎమ్మెల్యేలు చూసుకుంటారు.. మీరు ప్రశాంతంగా కూర్చోండి" అని జగన్ అంటున్నారని సంజీవ్ కుమార్ ఆరోపించారు. తన లోక్ సభ పరిధిలో ఏ పని అయినా ఎమ్మెల్యేలే చేసుకుంటూ పోతే... ఇక ఒక పార్లమెంటేరియన్ గా తన బాధ్యత ఏమిటని ప్రశ్నించారు.
ఇక ఒక పార్లమెంటేరియన్ గా తాను లోక్ సభలో ఆరు ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టినట్లు చెప్పిన సంజీవ్ కుమార్.. పార్లమెంటులో 18 డిస్కషన్స్ లో పాల్గొని, సుమారు 200 ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు. గత 30ఏళ్లలో కర్నూలు నుంచి ఎంపికైన ఎంపీలలో పార్లమెంట్ లో ఈ స్థాయి అకడమిక్ పెర్ఫార్మెన్స్ చేసిన మొదటి వ్యక్తి తానే అని సంజీవ్ తెలిపారు. ఈ సందర్భంగా తనకు 2019లో ఎంపీగా అవకాశం ఇచ్చినందుకు జగన్ అన్నకు ధన్యవాదాలు అని అన్నారు.
ఇదే సమయంలో బీసీలకు పెద్దపీట వేస్తామని చెబుతున్నది జనరల్ స్టేట్ మెంట్ అని, చెబుతున్నట్లుగానే బీసీలకు పదవి ఇస్తున్నారు తప్ప పవర్ అంటూ ఏమీ లేదనిపిస్తుందని అన్నారు. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనరిటీలు ఐకమత్యంగా ఉండాలని, వైసీపీలో బీసీలకు పదవులు ఇచ్చినట్లే ఇస్తున్నారు కానీ పవర్ అయితే లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తనకు అవకాశం కల్పించిన జగన్ అన్నను ఇప్పటికీ దేవుడిలా భావిస్తాను అని తెలిపారు.
ఏది ఏమైనా సంజీవ్ కుమార్ రాజీనామా, అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ రాజీనామాకు గల ప్రధాన కారణం.. వైసీపీలో పదవులు ఉన్నాయి తప్ప, ఎంపీలకు పవర్ లేదనేది ఆయన ఆవేదనగా తెలుస్తుంది!