సబర్మతికి చప్పట్లు.. మూసీకి నిందలా?: సీఎం రేవంత్ ఫైర్
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ గంగాపురం కిషన్‌రెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు.
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ గంగాపురం కిషన్‌రెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. మూసీ నది ప్రక్షాళనను అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడేదో జరిగిపోతోందన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కానీ, గుజరాత్‌లోని సబర్మతీ నదిని కూడా ప్రక్షాళన చేశారని, అప్పట్లో 50 వేల మందిని అక్కడ నుంచి తరలించిన విషయాన్ని కిషన్ రెడ్డి మరిచిపోయినట్టుగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
సబర్మతిని ప్రక్షాళన చేసినప్పుడు.. మోడీకి చప్పట్టు కొట్టిన కిషన్ రెడ్డి సహా బీజేపీ బృందం..ఇప్పుడు మూసీని ప్రక్షాళన చేస్తుంటే తమపై నిందలు వేస్తున్నారని.. దుమ్మెత్తి పోస్తున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ``కిషన్‌రెడ్డి గుజరాత్‌కు గులాముగా మారారు`` అని నిప్పులు చెరిగారు. సొంత రాష్ట్రం తెలంగాణలో మూసీని ప్రక్షాళన చేస్తుంటే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
పొరుగింటిపుల్ల కూర రుచి అన్నట్టుగా గంగా నది, సమర్మతీ నదులను ప్రక్షాళన చేస్తే చప్పట్లు కొట్టిన వారు..ఇప్పుడు మూసీ నదిని ప్రక్షాళన చేస్తుంటే ఓర్వలేక పోతున్నారని అన్నారు. ఈ క్రమంలోనే మూసీ నది ప్రక్షాళనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే.. ఎవరు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా తమను అడ్డుకోలేరని, మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని ఆయన చెప్పారు.
అలా చేయలేదంటే క్షమాపణకు రెడీ!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది కూడా కాలేదన్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ కొద్ది కాలంలోనే 50 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలకు గణాంకా లతో సహా చూపిస్తామన్నారు. 50 వేల మందిలో ఒక్కరు తగ్గినా క్షమాపణ చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. తాము అసలు ఉద్యోగాలే ఇవ్వలేదని ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఇప్పటికైనా ఆపాలని సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు.