చెరువులు.. చెట్లు.. హైదరాబాద్ లో హైడ్రా రూటు మారింది!
ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను చెరబట్టిన వారిపై కన్నెర్ర చేసిన హైడ్రా యంత్రాంగం ఇప్పుడు మరో పనిమీద ఫోకస్ పెట్టింది.
మూడు నాలుగు నెలల కిందట హైదరాబాద్ లో హైడ్రా హడావుడి మాములుగా లేదు. సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను తెల్లవారుజామున కూల్చివేయడం యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అక్కడితో ఆగకుండా హైదరాబాద్ శివారు మొయినాబాద్ లో పలువురు ప్రముఖులకు చెందిన అక్రమ నిర్మాణలను కూల్చివేసింది. వీరిలో కేంద్ర మాజీ మంత్రి స్థాయి వ్యక్తులు, బడా వ్యాపారవేత్తల ఫాంహౌస్ లు ఉండడంతో హైహై హైడ్రా అంటూ మీడియా కూడా వార్తలు కథనాలు రాసింది. అయితే, కొన్ని కారణాలతో హైడ్రా ఇప్పుడు కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను చెరబట్టిన వారిపై కన్నెర్ర చేసిన హైడ్రా యంత్రాంగం ఇప్పుడు మరో పనిమీద ఫోకస్ పెట్టింది.
బెంగళూరు చెరువులను చూసి..
హైడ్రా ఇప్పుడు హైదరాబాద్ లో ఏం చేస్తోంది అంటే..? ఇటీవల ఉన్నతాధికారులు కర్ణాటక రాజధాని బెంగళూరు వెళ్లి అక్కడ చెరువులు పునరుద్ధరణను పరిశీలించారు. మొన్నటివరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేరు చెబితే అక్రమ నిర్మాణదారుల్లో వణుకుపుట్టేది. హైదరాబాద్ లో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యను రంగనాథ్ కు ఫిర్యాదు చేయడం ద్వారా రోజుల్లో పరిష్కారం దొరికింది. అలాంటి హైడ్రా ఇప్పుడు రూటు మార్చింది. ఆక్రమణల కూల్చివేతలకు తాత్కాలిక విరామం ఇచ్చింది. బెంగళూరు వెళ్లి చెరువుల పునరుజ్జీవాన్ని అధ్యయనం చేసిన నేపథ్యంలో.. చెరువులు, కుంటల పునరుద్ధరణ లక్ష్యంగా కదులుతోంది.
ఆక్రమణల కూల్చివేతకు తాత్కాలిక విరామం
చెరువులు, కుంటల పునరుద్ధరణ ప్రధానంగా మారినందున హైడ్రా హైదరాబాద్ లో ఆక్రమణల కూల్చివేతలకు తాత్కాలిక విరామం ఇచ్చినట్లే. ఇక కమిషనర్ రంగనాథ్ సైతం గత వారం హైదరాబాద్ లో గతంలో ఎంతో పేరున్న బతుకమ్మ కుంటను పరిశీలించారు. అంబర్ పేటలోని ఈ కుంటతో పాటు తార్నాక ఎర్ర చెరువునూ చూశారు. బతుకమ్మకుంటలో పొక్లెయినర్లతో చెట్లు, మొక్కల తొలగింపును దగ్గరుండి ప్రారంభింపజేశారు. కాగా, ఇదే సమయంలో హైడ్రా అధికారులు వస్తున్న సంగతి తెలిసి స్థానికులు పెద్దఎత్తున అక్కడకు వచ్చారు. కూల్చివేతలు జరుగుతాయన్న ఆందోళనలతో కనిపించినవారికి తాము ఎలాంటి కూల్చివేతలు చేపట్టబోం అంటూ హైడ్రా అధికారులు అభయం ఇచ్చారు.
వృక్ష సంరక్షణపైనా ఫోకస్
హైదరాబాద్ ఒకప్పుడు లేక్ (సరస్సుల) సిటీ. ఇలాంటి నగరంలో సరస్సులు అంతరించిపోయే పరిస్థితిని కాపాడేందుకు పుట్టింది హైడ్రా. కాగా, ఇకమీదట నగరంలో వృక్షాల సంరక్షణ, ప్రమాదకరంగా మారిన వాటి తొలగింపునూ హైడ్రా చేపట్టనుంది. ట్రాఫిక్ కు ఇబ్బందిగా, కూలేందుకు సిద్ధంగా ఉన్న వృక్షాలను గుర్తించడం.. ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఆయా విభాగాలు అనుసరించాల్సిన వైనంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఈ ప్రకారమే.. గత వారం హైదరాబాద్ వ్యాప్తంగా భారీ, రోడ్డు, విద్యుత్తు తీగలకు అడ్డంగా ఉన్న వృక్షాల కొమ్మల కత్తిరింపు చేపట్టారు. ఇదంతా బాగానే ఉన్నా.. మరి హైడ్రా మళ్లీ అక్రమ నిర్మాణదారుల భరతం పట్టేదెప్పుడో?