కొడాలి నానికి మరో బిగ్‌ షాక్‌!

ఈ మేరకు దుగ్గిరాల ప్రభాకర్‌ అనే వ్యక్తి వీరి ముగ్గురుపై ఫిర్యాదు చేశారు.

Update: 2024-07-06 16:34 GMT

వైసీపీ మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదు కాగా తాజాగా మరో కేసు నమోదైంది. కొడాలి నానితోపాటు ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, నాటి జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ) మాధవీలతపై పోలీసులు కేసు పెట్టారు. ఈ మేరకు దుగ్గిరాల ప్రభాకర్‌ అనే వ్యక్తి వీరి ముగ్గురుపై ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై గుడివాడలో కేసు దాఖలైంది.

తన గోడౌన్‌ లో ఉన్న లిక్కర్‌ కేసులను పగులకొట్టి.. తగులబెట్టారని.. అంతేకాకుండా తన తల్లిని అసభ్యంగా కొడాలి నాని, వాసుదేవరెడ్డి దూషించడంతో ఆ మానసిక వేదనతో ఆమె మరణించారని దుగ్గిరాల ప్రభాకర్‌ గుడివాడ టూటౌన్‌ పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు.

తమ బాధ చెబితే నాడు జాయింట్‌ కలెక్టర్‌ గా ఉన్న మాధవీలత కూడా న్యాయం చేయకపోగా తమను దూషించారని ఆరోపించారు, ఈ నేపథ్యంలో పోలీసులు కొడాలి నాని సహా మిగిలిన వారిపై 448,427,506 ఆర్‌ అండ్‌ డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

పబ్లిక్‌ టెండర్‌ ద్వారా 2011లో తన తల్లి సీతామహాలక్ష్మి పేరుపై తాము ఏపీ బేవరెజెస్‌ లిక్కర్‌ గోడౌన్‌ లైసెన్స్‌ దక్కించుకున్నామని ప్రభాకర్‌ వివరించారు. ఈ క్రమంలో 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పద్మా రెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకు కొడాలి నాని, వాసుదేవరెడ్డి, మాధవీలత ప్రయత్నించారని ప్రభాకర్‌ ఆరోపించారు. ఆ గోడౌన్‌ ను స్వాధీనం చేసుకోవడానికి కొడాలి నాని అనుచరులు తమను బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ అప్పట్లో కొడాలి నాని అనుచరులు కొందరు ఫోన్లు చేసి బెదిరించారని ప్రభాకర్‌ వాపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో తనకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు చేశాక కూడా కొడాలి నాని పేరు ఎందుకు పెట్టావని కొందరు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని ప్రభాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వారి నుంచి తనకు ప్రాణభయం ఉందన్నారు. తనకు రక్షణ కల్పించాలని సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌ కు లేఖ రాస్తానన్నారు.

Tags:    

Similar News