ఆ ఎమ్మెల్యేకు మరో ఎమ్మెల్యే వైద్యం చేశారు
మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ ఇద్దరు డాక్టర్ ఎమ్మెల్యేల పేర్లు కూడా ఒకటే కావటం.
రాజకీయాల్లో ఇదో ఆసక్తికర సీన్ గా చెప్పాలి. ఇద్దరు ఎమ్మెల్యేలు. వారిద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు కావటం.. వారిద్దరూ వైద్యులు కావటం ఒక ఎత్తు అయితే.. తాజాగా ఒక డాక్టర్ ఎమ్మెల్యేకు ఆరోగ్య సమస్య వస్తే.. తమ జిల్లాకు చెందిన మరో డాక్టర్ ఎమ్మెల్యేను సంప్రదించటం.. ఆయనతో వైద్య పరీక్షలు చేయించుకోవటం ఆసక్తికరంగా మారింది. ఈ అరుదైన సంఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ ఇద్దరు డాక్టర్ ఎమ్మెల్యేల పేర్లు కూడా ఒకటే కావటం. ఎవరంటారా? అక్కడికే వస్తున్నాం.
ఆ ఇద్దరు డాక్టర్ ఎమ్మెల్యేల్లో ఒకరు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కాగా.. మరొకరు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్. వీరిద్దరు ఎమ్మెల్యేలుగా కాక ముందే వైద్యులు కావటం.. డాక్టర్లుగా బాగా ఫేమస్ కావటం గమనార్హం. ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత సెత్కస్కోప్ ను పట్టుకోకున్నా.. తోటి మిత్రుడి కోసం తాజాగా మరోసారి తెల్లకోటు వేసుకోవాల్సి వచ్చింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ప్రజాప్రతినిధిగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత డాక్టర ప్రాక్టీస్ చేయటం మానేశారు. అయితే.. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కోసం ఆయన మరోసారి తెల్లకోటు వేసుకున్నారు.
తాజాగా కంటి సమస్యతో బాధ పడుతున్న కోరుట్ల ఎమ్మెల్యే కోసం జగిత్యాల ఎమ్మెల్యే వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆయనకు చికిత్సకు అవసరమైన సూచనలు చేశారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాలి. బీఆర్ఎస్ బిగ్ బాస్ కేసీఆర్ ఫాంహౌస్ బాత్రూంలో కాలు జారిపడి గాయపడిన ఎపిసోడ్ లో.. ఆయనకు హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో సర్జరీ చేశారు. ఈ శస్త్రచికిత్ సమయంలో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ తెల్లకోటు వేసుకొని.. అధినేత సర్జరీ సమయంలో తోడుగా ఉండటమే కాదు.. కీలక పాత్ర పోషించినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి ఒకే పార్టీకి చెందిన డాక్టర్ ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.