వైసీపీకి మరో షాక్.. జనసేనలోకి ఆ ఎమ్మెల్యే!
ఇప్పటికే వైసీపీకి చెందిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ముంగిట అధికార పార్టీ వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామా ప్రకటించి వేరే పార్టీల్లో చేరారు. మరికొంతమంది చేరికలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇప్పటికే వైసీపీకి చెందిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే. అలాగే తాజాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ పార్టీ వీడటం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.
వెలగపల్లి వరప్రసాద్ కు వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన తాజా జాబితాల్లో సీటు దక్కలేదు. గూడూరు సీటును ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మేరిగ మురళీధర్ కు జగన్ కేటాయించారు. దీంతో వరప్రసాద్ కు సీటు లేకుండా పోయింది.
మాజీ ఐఏఎస్ అధికారి అయిన వెలగపల్లి వరప్రసాద్.. 2009లో చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తిరుపతి నుంచి పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీలో చేరి తిరుపతి నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2019లో ఆయనకు వైఎస్ జగన్ గూడూరు అసెంబ్లీ సీటును కేటాయించారు. దీంతో ఆ ఎన్నికల్లో గూడూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
ఈసారి వరప్రసాద్ కు జగన్ ఎక్కడా సీటు కేటాయించలేదు. దీంతో వరప్రసాద్ మంగళగిరి వచ్చి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను కలిశారు. వివిధ రాజకీయ అంశాలపై ఆయనతో చర్చించారు. జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపినట్టు సమాచారం. తనకు తిరుపతి ఎంపీ సీటు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ను కోరినట్టు ప్రచారం జరుగుతోంది.
అయితే వరప్రసాద్ కు పవన్ ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం. దీనిపై పార్టీలో చర్చించిన తర్వాత తన నిర్ణయం చెబుతానని వరప్రసాద్ కు చెప్పినట్టు తెలుస్తోంది. టీడీపీతో పొత్తులో ఉండటంతో ఆ పార్టీ నేతలతోపాటు తిరుపతి జనసేన పార్టీ నేతలతో పవన్ దీనిపై చర్చించనున్నారు.
కాగా వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ పవన్ ను కలవడంతో రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అధికార వైసీపీ నేతలు వల్లభనేని బాలశౌరి, ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు పవన్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి బాటలో వైసీపీ గూడూరు ఎమ్మెల్యే కూడా చేరడం గమనార్హం.