వంశీని వదిలిపెట్టం.. పక్కాగా కేసు : కమిషనర్ రాజశేఖర్ బాబు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కఠిన చర్యలకు ప్రభుత్వం పక్కా వ్యూహం రచిస్తోందని టాక్ వినిపిస్తోంది.

Update: 2025-02-14 10:51 GMT

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి తీసుకుంటామని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు వెల్లడించారు. వంశీని కస్టడీకి అప్పగించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. ఈ కేసులో మిగిలిన నిందితులను త్వరలో అరెస్టు చేస్తామన్నారు.

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కఠిన చర్యలకు ప్రభుత్వం పక్కా వ్యూహం రచిస్తోందని టాక్ వినిపిస్తోంది. కిడ్నాప్ కేసులో వంశీని అరెస్టు చేసిన పోలీసులు విచారణ పేరుతో ఆయనను కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. వంశీపై దాదాపు 16 కేసులు పెండింగులో ఉన్నాయి. ఈ కేసుల్లో కూడా ఆయనపై చర్యలు తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జిల్లా జైలులో ఉన్న వంశీని కస్టడీకి ఇప్పించాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారని చెబుతున్నారు. వంశీ అరెస్టుకు కారణమైన కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతానికి వంశీతోపాటు మరో ఇద్దరు అరెస్టు అయిన విషయం తెలిసిందే. నేరం ఎలా జరిగింది? టీడీపీ ఆఫీసుపై దాడి కేసు ఉపసంహరించుకునేలా బాధితుడిపై ఎవరెవరు ఒత్తిడి తెచ్చారు? వారికి ఎవరు సహకరించారు? వంటి అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సాంకేతిక ఆధారాలు సేకరించడంతోపాటు మిగిలిన నిందితులకు ఎవరు షెల్టర్ ఇచ్చే అవకాశం ఉందన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.

కిడ్నాప్ కేసు నుంచి వంశీ తప్పించుకోలేరని సీపీ రాజశేఖర్ బాబు స్పష్టం చేయడంతో ఆయనకు బెయిల్ ఇప్పట్లో లభిస్తుందా? అనేది కూడా చర్చనీయాంశమవుతోంది. మరోవైపు వంశీని బయటకు తెచ్చేందుకు ఆయన భార్య పంకజశ్రీ న్యాయవాదులను సంప్రదిస్తున్నారు. వైసీపీ నేతలు కూడా న్యాయ సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో ఈ కేసులో వంశీ భవితవ్యంపై సస్పెన్స్ కొనసాగుతోంది.

Tags:    

Similar News