ఏపీలో విద్యుత్ ర‌గ‌డ‌.. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ!

విద్యుత్ కంపెనీల‌కు(డిస్క‌మ్‌) వ‌స్తున్న న‌ష్టాల‌ను.. ప్ర‌జ‌ల‌పై మోపుతున్నారంటూ.. వైసీపీ నాయ‌కులు నిప్పులు చెరుగుతున్నారు.

Update: 2024-10-28 13:29 GMT

ఏపీ రాజ‌కీయాలు అంటేనే హాట్ టాపిక్‌. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వ‌ర‌ద‌లు, కృష్నాన‌దిలో బోట్ల వ్య‌వ‌హారం.. త‌ర్వాత‌.. కాదంబ‌రి జెత్వానీ, ఆ త‌ర్వాత‌.. ష‌ర్మిల ఆస్తులు.. ఇలా రోజుకొక రూపంలో రాజ‌కీయాలు మారు తూనే ఉన్నాయి. ఇక‌, ఇప్పుడు విద్యుత్ చార్జీల వ్య‌వ‌హారం మ‌రింత‌గా సెగ‌లు క‌క్కుతోంది. విద్యుత్ కంపెనీల‌కు(డిస్క‌మ్‌) వ‌స్తున్న న‌ష్టాల‌ను.. ప్ర‌జ‌ల‌పై మోపుతున్నారంటూ.. వైసీపీ నాయ‌కులు నిప్పులు చెరుగుతున్నారు.

యూనిట్‌కు రూ.1.67 పైస‌లు చొప్పున న‌వంబ‌రు బిల్లుల నుంచి వ‌సూలు చేసుకునేందుకు ఏపీ ఈఆర్ సీ(ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యుత్ నియంత్ర‌ణ మండ‌లి) అనుమ‌తినివ్వ‌డాన్ని వైసీపీ నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో త‌ప్పుబ‌డుతున్నారు. ఇలా చేయ‌డం కూట‌మి ఇచ్చిన ఎన్నిక‌ల హామీల‌కు విరుద్ధ‌మంటూ.. స్వ‌యంగా జ‌గ‌న్ పోస్టు చేశారు. ఎన్నిక‌ల‌కుముందు విద్యుత్ చార్జీల‌ను పెంచ‌బోమంటూ.. క‌ర్నూలు, అనంత‌పురం స‌భ‌ల్లో చంద్ర‌బాబు చెప్పిన విష‌యాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

ఇక‌, మ‌రికొంద‌రు నాయ‌కులు కూట‌మికి 164 సీట్లు ఇచ్చినందుకు.. కూట‌మి ప్ర‌భుత్వం.. 167 పైస‌ల భారాన్ని ప్ర‌జ‌ల‌పై మోపుతోందంటూ.. వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. సోమ‌వారం ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు ఇవే కామెంట్ల‌తో వైసీపీ సోష‌ల్ మీడియా నిండిపోయింది. ఇక‌, ఇటు వైపు ప్ర‌భుత్వ ప‌క్షం కూడా.. అంతే దీటుగా స‌మాధానం చెబుతోంది. అస‌లు విద్యుత్ చార్జీల‌ను పెంచిందే.. వైసీపీ ప్ర‌భుత్వ‌మ‌ని మంత్రులు గొట్టిపాటి ర‌వి, కొలుసు పార్థ‌సార‌థి, కొల్లు ర‌వీంద్ర వంటివారు ఫైర‌య్యారు.

జ‌గ‌న్ హ‌యాంలో 9 సార్లు విద్యుత్ పెంచిన వైసీపీ నాయ‌కులు ఇప్పుడు.. గ‌గ్గోలు పెట్ట‌డం ఏంట‌ని.. వారు ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయం చేస్తున్నార‌ని వారు మండిప‌డ్డారు. అంతేకాదు.. అస‌లు ఇప్పుడు పెంచుతున్న 1.67 రూపాయ‌ల చార్జీల భారం కూడా ..జ‌గ‌న్ పాల‌న‌లో చేసిన పాప‌మేన‌ని దుయ్య‌బ‌డుతున్నారు. ఈ ప‌రిణామాల‌తో ఏపీ రాజ‌కీయం మ‌రోసారి కాక‌రేగింది.

Tags:    

Similar News