ముగ్గురు మహిళలు - నాలుగు హత్యలు... ఏపీలో సైనైడ్ తో సీరియల్ కిల్లర్స్!

ఏపీలో ఓ సీరియల్ హత్యల వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ షాకింగ్ విషయాలు వెల్లడించారు.

Update: 2024-09-07 13:15 GMT

ఏపీలో ఓ సీరియల్ హత్యల వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ షాకింగ్ విషయాలు వెల్లడించారు. ముగ్గురు మహిళలు నాలుగు హత్యలు చేసినట్లు తెలిపారు. ఎవరూ ఊహించని విధంగా అన్నట్లుగా సైనైడ్ ఇచ్చి, ఎవరికీ అనుమానం రాకుండా వరుస హత్యలకు పాల్పడ్డ వివరాలను వెల్లడించారు.

అవును... రజని (40), వెంకటేశ్వరి (32), రమణమ్మ (60)లను అదుపులోకి తీసుకున్న గుంటూరు జిల్లా పోలీసులు.. ఓ హత్య కేసు విచారణలో భాగంగా వీరిని సీరియస్ కిల్లర్స్ గా గుర్తించారు. తీసుకున్న అప్పు తీర్చమని ఒత్తిడి తెస్తున్నారని.. ఆస్తుల కోసం సొంత బంధువులను హతమార్చారని.. పలు విషయాలు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ ఏడాది జూన్ 5న గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి సమీపంలో గుర్తుతెలియని ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. అప్పటికే ఆ మృతదేహం కుల్లిపోయి ఉండటంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపించారు.

అయితే.. పోస్ట్ మార్టంలో మృతదేహంలో సైనైడ్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. దీంతో... దీన్ని హత్యగా కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలో... మృతురాలు తెనాలిలోని యడ్ల లింగయ్య కాలనీకి చెందిన నాగూర్బీగా గుర్తించారు. ఈ దర్యాప్తులోనే పలు కీలక విషయాలు తెరపైకి వచ్చాయి.

ఇదే కాలనీకి చెందిన రజనీ అనే మహిళ.. నాగూర్బీ వద్ద అప్పు తీసుకుందట. ఈ సమయంలో అప్పు తిరిగి చెల్లించాలంటూ తనపై ఒత్తిడి తెస్తున్న ఆమెను ఎలాగైనా చంపాలని రజనీ ఆలోచన చేసింది. ఈ విషయాన్ని వెంకటేశ్వరి అలియాస్ బుజ్జితో చెప్పడంతో.. అంతా కలిసి నాగూర్బీ హత్యకు ప్లాన్ చేశారు.

ఇందులో భాగంగా... ఆమెను నమ్మకంగా నిర్జీవ ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం అక్కడ బ్రీజర్ లో సైనైడ్ కలిపి తాగించారు. దీంతో నాగూర్బీ చనిపోయిన తర్వాత అక్కడ నుంచి జారుకున్నారు. దర్యాప్తులో భాగంగా సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించి రజనీ, నాగూర్బీ వెళ్లిన ఆటోను గుర్తించి కూపీ లాగారట.

దీంతో... తల్లి రమణమ్మ, కుమార్తె వెంకటేశ్వరి లు చేసిన సీరియల్ హత్యలు బయటపడ్డాయని ఎస్పీ వెల్లడించారు. నాగూర్బీ కంటే ముందు బుజ్జి.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన మేనత్త సుబ్బలక్ష్మి ఆస్తి రాసివ్వడం లేదంటూ 2022లో ఆమెకు తన తల్లితో పాటు కలిపి మద్యంలో సైనైడ్ కలిపి తాగించి చంపేసింది.

ఇక 2023 ఆగస్టులో బాకీ చెల్లించాని ఒత్తిడి చేస్తుందని నాగమ్మ అనే వృద్ధురాలికి కూల్ డ్రింక్ లో సైనైడ్ కలిపి ఇచ్చి చంపేశారు. 2024 ఏప్రిల్ లో మోషె అనే వ్యక్తి.. తన భార్య భూదేవిని తరచూ వేధిస్తున్నాడని.. భూదేవి, రమణమ్మ, వెంకటేశ్వరి లు కలిసి మద్యంలో సైనైడ్ కలిపి చంపేశారని.. ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయనే ఈ హత్య చేశారని అంటున్నారు.

ఆ విధంగా అప్పటికే మూడు హత్యలు చేసిన ఈ వెంకటేశ్వరి.. తెనాలికి చెందిన రజనీతో కలిసి నాగూర్బీని హత్య చేశారు. ఆ హత్య కేసు దర్యాప్తులో భాగంగానే... ఈ సీరియల్ హత్యల గుట్టు రట్టయ్యింది. ఇప్పుడు ఈ వ్యవహారం గుంటూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.

Full View
Tags:    

Similar News