ఏపీలో అధికారులు... ఏం చేయాలన్నా.. వణికిపోతున్నారు..!
ఏ ప్రభుత్వానికైనా అధికారులు కీలకం. ముఖ్యంగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అత్యంత కీలకం. సర్కారు చేపట్టే కార్యక్రమాలు
ఏ ప్రభుత్వానికైనా అధికారులు కీలకం. ముఖ్యంగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అత్యంత కీలకం. సర్కారు చేపట్టే కార్యక్రమాలు.. తీసుకునే నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది వారే. అయితే.. ఇప్పుడు కూటమి సర్కారు హయాంలో ఏం చేయాలన్నా.. అధికారులు వణికి పోతున్నారు. నిజానికి ఒకప్పుడు కూడా ఇలాంటి పరిస్థితినే రాష్ట్రం ఎదుర్కొంది. 2012లో జగన్‌పై కేసులు నమోదయ్యాయి. దీనికి సమాంతరం.. అప్పటి ఐఏఎస్ అధికారులపైనా సీబీఐ కేసులు పెట్టింది.
చాలా మంది అధికారులు జైళ్లకు కూడా వెళ్లారు. దీంతో తర్వాత కొలువుదీరిన రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో ఉన్నతాధికారులు వణికి పోయిన పరిస్థితి కనిపించింది. ఎవరూ ఏ పనినీ స్వతంత్రంగా చేయలేదు. అంతేకాదు.. సీఎం మౌఖికంగా చెప్పిన వాటిని కూడా చేయలేదు. రాత పూర్వకంగా ఇస్తే తప్ప చేయబోమని కొందరు చెప్పారు. దీంతో పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దీనికి కారణం.. తదుపరి వచ్చే ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే.. తమ కెరీర్ దెబ్బతింటుందన్న భావనే!
కట్ చేస్తే.. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏపీలో మరోసారి వచ్చింది. వైసీపీ హయాంలో పనిచేసిన అధికారులపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. గనుల శాఖ ఎండీ వెంకట రెడ్డి నుంచి అప్పటి ఐపీఎస్‌లపై విచారణలు సాగుతున్నాయి. వీరిపై నేరాలు రుజువైతే.. జైలు తప్పదన్న వాదన కూడా బలంగా వినిపి స్తోంది. ఈ ప్రభావం ప్రస్తుత కూటమి సర్కారుపైనా పడింది. సీనియర్ అధికారులు ఎవరూ.. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారు.
దీనికి ఉదాహరణ.. తాజాగా సీఎం చంద్రబాబు అడిగిన ప్రశ్న. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై ఇప్పటి వరకూ ఏం చర్యలు తీసుకున్నారో నివేదించాలని ఉన్నతాదికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కానీ, ఎవరూ ముందుకు రాలేదు. శ్వేతపత్రాలు ఇచ్చి మూడు మాసాలైనా.. ఇప్పటి వరకు అధికారులు వాటి జోలికి పోలేదు. దీనికి కారణం.. తదుపరి వచ్చే ప్రభుత్వం తమను టార్గెట్ చేస్తే.. పరిస్థితి ఏంటన్న భావన వారిలో ఉంది.
అందుకే.. చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించిన శ్వేతపత్రాలు.. ఇప్పటికీ కఫ్‌బోర్డులో అలానే ఉన్నాయి. నిజానికి అప్పట్లో భూములు, గనులు, ఆర్థికం, పరిశ్రమలు, పోలవరం, సాగునీటి రంగం, ఇంధనం, శాంతిభద్రతలు, ఎక్సైజ్, అమరావతి తదితర అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. వాటిలో అవినీతి జరిగిందన్నారు. కానీ, అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు పక్కన పెట్టారు. సో.. దీనికి కారణం వారు హడలి పోతుండడమే. ఈ నేపథ్యంలో చంద్రబాబు వారికి భరోసా ఇవ్వడమో.. లేక స్వతంత్రత ఇవ్వడమో చేయాలి. లేకపోతే.. మరో నాలుగేళ్లయినా.. అవిఅక్కడే ఉండిపోతాయి.