మొదటి రోజే జీతం మాటను తప్పితే ఎలా చంద్రబాబు?

కొన్ని హామీలు ఇవ్వటం వరకుబాగానే ఉంటుంది కానీ వాటిని అమలు చేయటం అంత తేలికైన విషయం కాదు.

Update: 2025-01-06 05:47 GMT

కొన్ని హామీలు ఇవ్వటం వరకుబాగానే ఉంటుంది కానీ వాటిని అమలు చేయటం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏపీలో నెలకొంది. తాము ప్రతిపక్షంలో ఉన్న వేళలో.. గత ప్రభుత్వం ఉపాధ్యాయులకు జీతం నెల మొదటి రోజునే ఇచ్చేస్తామంటూ మాటలు చెప్పేవారు. సదరు ప్రభుత్వం ఆలస్యంగా జీతాలు ఇవ్వటాన్ని పదే పదే ప్రస్తావించేవారు. తాము అధికారంలోకి వస్తే.. నెల మొదటి రోజే జీతాలు వేస్తామన్న ఊరింపు మాట తరచూ వినిపించేవారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నేత్రత్వంలోని కూటమి ప్రభుత్వమే ఉంది.

ఈ ఏడాది మొదటి నెల వచ్చేసి ఆరురోజులు అవుతోంది. మరో వారంలో తెలుగు వారికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అతి పెద్ద పండుగైన సంక్రాంతి రానుంది. ఇలాంటి వేళలో జీతాల్ని నెల మొదటి రోజే వేయాల్సి ఉంది. కానీ.. ఏపీలోని ఉపాధ్యాయులకు ఇప్పటివరకు జీతాలు పడని దుస్థితి. గత ఏడాది డిసెంబరు 31నే బిల్లులు రెఢీ అయ్యాయని.. జనవరి 1న వేతనాలు పడిపోతాయన్న ప్రచారం జోరుగా సాగింది.

వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. నెల మొదలై ఆరో రోజుకు వచ్చినా.. ఇప్పటివరకు జీతాల ఊసే లేకుండా పోయింది. గత ప్రభుత్వంలోనూ ఇలాంటి పరిస్థితినే తాము ఎదుర్కొన్నామని.. ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చిందంటున్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన మొదటి మూడు నెలల వరకు ఠంచన్ కు ఒకట్రెండు తేదీల్లోనే జీతాలు పడేవని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు. ఇటీవల కాలంలో నెల మొదటి పది రోజుల్లో ఏదో ఒక రోజు జీతాలు పడుతున్నాయని చెబుతున్నారు.

మిగిలిన నెలల సంగతిఎలా ఉన్నా.. సంక్రాంతి పండుగ ముంగిట్లోకి వచ్చేసిన నెలలో అయినా ముందుగా జీతాలు పడితే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఉపాధ్యాయులకు జీతాలు మొదటి వారంలో వేయలేనంత గడ్డు పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందా? అన్నది ప్రశ్నగా మారింది. పాలనలో అపార అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు.. టీచర్ల జీతాలు టైంకు వేసే విషయంలో ఎందుకు ఫెయిల్అవుతున్నట్లు? నిజంగానే ఆర్థిక పరిస్థితి బాగోలేదనే అనుకుందాం.. దాన్ని తీర్చిదిద్దేందుకు ఆరేడు నెలల టైం సరిపోలేదా? అన్నది మరో ప్రశ్న. ఎన్నికల వేళ తాము ఇచ్చిన మాటను తప్పుతున్న విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ గుర్తించారా? ఇదే విషయాన్ని చంద్రబాబుతో చర్చించారా? అన్న ప్రశ్నలు పలువురి నోట వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News