నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు... టీడీపీ మంత్రి !

నీకు పదిహేను వేలు అంటూ ప్రతీ ఇంటి గడప తొక్కి విపరీతంగా ప్రచారం చేసింది ఎవరో కాదు గోదావరి జిల్లాలోని పాలకొల్లుకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు.

Update: 2024-09-22 12:48 GMT

నీకు పదిహేను వేలు అంటూ ప్రతీ ఇంటి గడప తొక్కి విపరీతంగా ప్రచారం చేసింది ఎవరో కాదు గోదావరి జిల్లాలోని పాలకొల్లుకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు. ఆయనే ప్రతీ ఇంట్లో టీడీపీ మేనిఫెస్టో పంచిపెడుతూ చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. దానికి ఇపుడు రివర్స్ లో వైసీపీ చెడుగుడు ఆడుతోంది.

వైసీపీ అధినేత జగన్ నీకు పదిహేను వేలూ అంటూ చంద్రబాబు చెప్పారా లేదా అని ప్రశ్నిస్తున్నారు. హామీలు ఏవీ ఎక్కడ అమలు అయ్యాయని కూడా నిలదీస్తున్నారు. దీనికి నిమ్మల రామానాయుడు ధాటీగానే బదులిచ్చారు

నీకు పదిహేను వేలు అన్నది తమ పధకం కాదు విధానమని అన్నారు. తప్పకుండా ఆ పధకాన్ని అమలు చేసి తీరుతామని కూడా చెప్పారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ కచ్చితంగా పదిహేను వేల రూపాయలు తల్లికి వందనం కార్యక్రమం కింద ఇచ్చి తీరుతామని అన్నారు.

అదే విధంగా తాము మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు అని కూడా కామెంట్స్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు మాత్రమే అయిందని అయినా ఎందుకు పధకాలు అమలు చేయలేదని జగన్ ప్రశ్నిస్తున్నారని నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతీ పధకం తుచ తప్పకుండా అమలు చేసి తీరుతామని అన్నారు. జగన్ అమ్మ ఒడి పధకాన్ని ప్రకటించిన తొమ్మిది నెలల తరువాతనే అమలు చేశారు అని గుర్తు చేశారు. అది కూడా పదిహేను వేల రూపాయలు పూర్తిగా ఇవ్వలేదని కొందరికి ఆరేడు వేలు కూడా వచ్చాయని అన్నారు.

ఇక ప్రతీ ఇంటిలో ఎంతమంది ఉంటే అందరికీ పధకం ఇస్తామని చెప్పి జగన్ మాట తప్పారని మడమ తిప్పారని అన్నారు. జగన్ చెప్పిన పధకాలు ఏవీ సవ్యంగా అమలు చేయలేదని అన్నారు. ఆయన మాదిరిగా తాము కూడా చేస్తామని పొరపడుతున్నారని అన్నారు.

కానీ తాము కచ్చితంగా పధకాలు ఇస్తామని చెప్పారు. అయిదేళ్ళ పాటు అధికారంలో ఉన్న జగన్ నాలుగేళ్ల పాటు మాత్రమే పధకాలను అమలు చేశారని కూడా మంత్రి విమర్శించారు. తాము అన్ని వర్గాల కోసం రూపొందించిన కార్యక్రమాలు అమలు అవుతాయని అన్నారు.

అయితే నిమ్మల తల్లికి వందనం పధకం ద్వారా ప్రతీ కుటుంబానికి అందరికీ ఇస్తామని చెప్పారు కానీ ఎప్పటి నుంచో చెప్పలేదు. మరి మంత్రి గారి ప్రకటనను చూస్తే కనీసంగా ప్రతీ కుటుంబంలో ఇద్దరు పిల్లలు అయినా ఉంటారు. అలా పేదరికంతో ఉన్న తెల్ల కార్డు కుటుంబాలకు ఈ పధకం వర్తింప చేయాలని చూసినా ఏపీలో కోటిన్నర తెల్ల కార్డు కుటుంబాలు ఉన్నాయి. అంటే మూడు కోట్ల మందికి ఈ పధకం వర్తింప చేయాలి.

అలా చూస్తే కనుక కచ్చితంగా ఈ ఒక్క పధకానికే 45 వేల కోట్ల దాకా అవుతుందని అంటున్నారు.మరి ఏపీ ప్రభుత్వం భారీ పధకాని అమలు చేసేందుకు సిద్ధంగా ఉందా, అంత డబ్బు ఇప్పట్లో సమకూర్చుకోగలగరా అన్నది చూడాలి. ఎందుకంటే పెన్షన్ పధకానేక్ 50 వేల కోట్ల రూపాయలు ఏటా ఖర్చు అవుతోంది. దానికి ఈ పధకం కలిపితే లక్ష కోట్లు అవుతాయి.

అలాగే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పధకం, ప్రతీ 18 ఏళ్ళు నిండిన మహిళకూ ఏటా 18 వేల రూపాయలు, అలాగే మూడు వేల నిరుద్యోగ బృతి, రైతులకు ఇరవై వేల రూపాయల్ భరోసా ఇవన్నీ కూడా ఇస్తే కనుక కచ్చితంగా రెండు లక్షల కోట్లు కేవలం పధకాలకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది మరి టీడీపీ అంత మొత్తంలో ఖర్చు చేసే స్తోమతలో ఉందా అన్నదే చర్చ. ఏది ఏమైనా మంత్రిగారు చెప్పారు కాబట్టి ఇచ్చే వీలుంది. కానీ అది ఎపుడు అన్నది మాత్రం ఎవరూ చెప్పలేరు అని అంటున్నారు.

Tags:    

Similar News